కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పత్తి వ్యాపారి మహబూబ్ బాషా(50) శనివారం రాత్రి ఆదోనిలో టీడీపీ నాయకుడు భూపాల్ చౌదరికి చెందిన జిన్నింగ్ మిల్లు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదోని : కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పత్తి వ్యాపారి మహబూబ్ బాషా(50) శనివారం రాత్రి ఆదోనిలో టీడీపీ నాయకుడు భూపాల్ చౌదరికి చెందిన జిన్నింగ్ మిల్లు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్లుకు విక్రయించిన పత్తికి డబ్బులు రావడం ఆలస్యం కావడం వల్లే బాషా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రైతుల నుంచి కొనుగోలు చేసిన సుమారు రూ.2.50కోట్ల విలువైన పత్తిని బాషా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుమారుడైన భూపాల్ చౌదరికి విక్రయించారు.
అయితే దీనికి సంబంధించి ఇంకా రూ.14 లక్షలు బాషాకు చెల్లించాల్సి ఉంది. అదే సమయంలో బకాయిల విషయమై రైతుల నుంచి బాషాకు ఒత్తిడి అధికమైంది. దీంతో బాషా శనివారం రాత్రి భూపాల్‌చౌదరి ఫ్యాక్టరీ వద్ద అమ్మోనియం ఫాస్పేట్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుని వివరణ కోరగా.. బాషాకు కేవలం రూ.5 లక్షల మాత్రమే చెల్లించాల్సి ఉందని మీడియాకు తెలిపారు.