రాజధాని మాఊళ్లోనే పెట్టేవాడిని: చంద్రబాబు
తనకు స్వార్థం ఉంటే.. తమ ఊళ్లోనే రాజధాని నగరం పెట్టుకునేవాడినని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఒక్కసారి అనుకుంటే ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ మాట్లాడలేదని, ప్రతిపక్ష నేతగా ఉన్న తనతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిందని ఆరోపించారు.
అందరికీ న్యాయం జరగాలని ఢిల్లీలో అందరినీ కలిసి ప్రయత్నాలు చేశానని, కానీ ఏమాత్రం లెక్కపెట్టకుండా రాష్ట్రాన్ని విడదీశారని అన్నారు. రాజధాని కట్టుకోకపోతే ముందుకు పోలేమని, అందరికీ అనుకూలంగా రాజధాని ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఎక్కడో పోరంబోకు ఉంది, అడవి ఉందని అక్కడ కట్టుకోలేమని మండిపడ్డారు. రాజధాని అంటే సోషల్ లైఫ్ ఉండాలని, రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పారు. మారుమూల ప్రాంతంలో రాజధాని పెడితే అక్కడ మనుషులు కూడా ఉండరన్నారు.