పటిష్టంగా పోలీస్ బందోబస్త్
ఓటుహక్కును వినియోగించుకున్న 7,404 మంది
పోలింగ్ తీరును పర్యవేక్షించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ
వేలేరుపాడులో 4 గురు, కుకునూరులో 11 మంది ఓటింగ్
ఏలూరు సిటీ :
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలను తలపిస్తూ అధికార టీడీపీ శ్రేణులు ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచీ మోహరించాయి. జిల్లావ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో 7,404 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 79 శాతం పోలింగ్ నమోదు అయింది. కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ తీరును ఎప్పకప్పుడు పర్యవేక్షించారు.
ఏలూరు గ్జేవియర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాము సూర్యారావు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ముందుస్తు చర్యలు చేపట్టామని 850 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించామని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. ఇక ఓటర్ల జాబితాలో ఎప్పుడో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పేర్లు ఉండడంతో ఎన్నికల అధికారులకు కాస్త తలనొప్పిగా మారింది. యూటీఎఫ్ మద్దతుతో పోటీలో ఉన్న రాము సూర్యారావు ఏలూరులోని గ్జేవియర్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లగా ఎన్నికల అధికారులు నిరాకరించారు. 2007లో పదవీ విరమణ చేసిన ఆయన నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటినందున ఓటు వేయకూడదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఓటర్ల జాబితాలో తన పేరు ఉన్నందున ఓటు వేస్తానని ఆయన అనడంతో కలెక్టర్ అనుమతించారు. దీంతో ఆయన ఉదయం 11.30 గంటలు దాటాక ఓటు వేశారు.
మెల్లగా సా...గింది
ఎమ్మెల్సీ పోలింగ్ నత్తనడకన సాగింది. ఉదయం 8 గంటలకే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినా ఓటర్లు మాత్రం తాపీగా కేంద్రాలకు వచ్చారు. ఉదయం 10 గంటలకు జిల్లాలో 21.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో 4,813 మంది ఓటు వేయగా 51.34 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక రెండు గంటలకు 68.01 శాతం పోలింగ్‌తో 6,384 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో 7,404 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో పురుష ఓటర్లు 4,722 మంది, మహిళా ఓటర్లు 2,682 మంది ఉన్నారు.
వేలేరుపాడులో 4గురు
జిల్లాలోని వేలేరుపాడులో నలుగురు ఓటర్లు మాత్రమే ఉండగా వారి కోసం ఐదుగురు పోలింగ్ సిబ్బంది, పదిమంది పోలీసులు విధులు నిర్వహించారు. వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళా ఓటరు ఉన్నారు. ఈ నలుగురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కుకునూరులో 14 మంది ఓటర్లు ఉండగా 11మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ ఇలా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని ఏలూరు డివిజన్‌లో 17 పోలింగ్ కేంద్రాల్లో 74.19 శాతం పోలింగ్ నమోదు అయింది. 3,406 మంది ఓటర్లకు గానూ 2,527 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1,473, మహిళా ఓటర్లు 1,054 మంది ఉన్నారు. కొవ్వూరు డివిజన్‌లో 12 పోలింగ్ కేంద్రాల్లో 76.26 శాతం పోలింగ్ నమోదు అయింది. 2,123 మంది ఓటర్లు ఉండగా 1,619 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1,066 మంది, మహిళలు 553 మంది ఉన్నారు. నరసాపురం డివిజన్‌లో 12 పోలింగ్ కేంద్రాల్లో 84.32 శాతం పోలింగ్ నమోదు అయింది. 2,902 మంది ఓటర్లు ఉంటే 2,447 మంది ఓటు వేశారు. వారిలో 1,653 మంది పురుష ఓటర్లు, 794 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 8 పోలింగ్ కేంద్రాల్లో 85.91 శాతం పోలింగ్ నమోదు అయింది. 944 మంది ఓటర్లు ఉంటే 811 మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 530 మంది పురుష ఓటర్లు, 281 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మండలి పోలింగ్ ప్రశాంతం
Published Mon, Mar 23 2015 3:05 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement