Teacher elections
-
పోలింగ్ నేడే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనమండలిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ సీట్ల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఓట్లు 1,96,321 ఉండగా.. ఉపాధ్యాయుల ఓట్లు 23,214 ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కోసం 15 కొత్త జిల్లాల్లో 313 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ స్థానానికి జరిగే పోలింగ్‌కు 253 పోలింగ్ కేంద్రాలు పనిచేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈనెల 26న జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 17 మంది, ఉపాధ్యాయ స్థానానికి ఏడుగురు పోటీ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ కోసం 17 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి టి.జీవన్‌రెడ్డి, బీజేపీ నుంచి పి.సుగుణాకర్‌రావు, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమ పోటీ చేస్తుండగా.. గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కామారెడ్డికి చెందిన రణజిత్ మోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కరీంనగర్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన కేశిపతి శ్రీధర్‌రాజు ఇటీవల పోటీనుంచి తప్పుకుని టీఆర్ఎస్ మద్దతుదారుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించారు. ఇక టీచర్ల ఎమ్మెల్సీకి ప్రస్తుత శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ తరఫున కూర రఘోత్తంరెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు నాలుగు పూర్వ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఓటేసే ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు అర్హత గల ఉద్యోగులందరికీ ప్రభుత్వం శుక్రవారం రోజున ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అర్హత గల ఉద్యోగులందరు ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిపుష్టికి తమవంతు సహకారం అందించాలని కోరారు. అలాగే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంబంధిత సంస్థలకు కూడా శుక్రవారం సెలవు వర్తింస్తుందని తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల సామగ్రిని కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం, హుజూరాబాద్ రెండు చోట్లనుంచి ఇచ్చి పంపించినట్లు ఆయన తెలిపారు. పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 409 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 430 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 430 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1227 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లను ఎన్నికల నిర్వహణకు నియమించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 1227 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను అన్ని పోలింగ్ స్టేషన్లలో వందశాతం వెబ్æకాస్టింగ్, వీడియోగ్రఫీ చేయిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్లలో ఎస్సై, ఏఎస్ఐ, హెచ్ఎస్వోలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఇతర పోలీసులు, హోంగార్డులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిసెప్షన్ సెంటర్ కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశామని, శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి ఇండోర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్లో బ్యాలెట్ బాక్సులను స్వీకరించి పటిష్టమైన పోలీసు బందోబస్తుతో బలపరుస్తామని వివరించారు. -
పట్టభద్రుల దళపతి.. దేశపతి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, గాయకుడు, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారా? సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా మేధావిగా పేరున్న ఉద్యమకారుడిని బరిలో నిలిపి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకునేందుకు పావులు కదుపుతున్నారా? ప్రగతి భవన్ కేంద్రంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఇవి నిజమేనని అనిపిస్తోంది. నోటిఫికేషన్ జారీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్టీయూ నుంచి పోటీ చేస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపికపై కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యం కలిగి, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని మేధావి వర్గానికి చెందిన వ్యక్తిని పెద్దల సభకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. సిద్ధిపేట వాస్తవ్యుడైన దేశపతి శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‌కుఅత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన దేశపతి శ్రీనివాస్ ఉద్యమ సమయంలో హృదయాలను కదిలించేలా పాటలు రాయడంతో పాడి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా అధికార హోదాలో వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని దేశపతిని శాసనమండలికి పంపించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. దేశపతి పెద్దల సభకు అడుగుపెడితే శాసనమండలి హుందాతనం పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు.. సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జీవన్‌రెడ్డికి సమన్వయకర్తగా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని 42 శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించిన ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో కొన్ని సీట్లు దక్కాయి. అదే సమయంలో జీవన్‌రెడ్డి ఓటమి పాలు కావడంతో ఆయన పట్ల కొంత సానుభూతి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే నాయకుల విషయంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇతర విద్యావంతులు ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు దేశపతి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్వామి గౌడ్ పేరు సైతం శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఆరేళ్ల క్రితం ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. శాసనమండలిలో ఆయనకు చైర్మన్ హోదా ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి మరోసారి పెద్దల సభకు పంపే అవకాశాలను కూడా టీఆర్ఎస్ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగిన పాతూరి సుధాకర్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చినట్టుగానే , చివరి నిమిషయంలో స్వామిగౌడ్‌కు సైతం అవకాశం దక్కుతుందేమోనని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరితో పాటు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇన్చార్జి డీటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ తదితరులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
మోగిన మండలి నగారా
కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం మండలి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి, ఉపా«ధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుదిగడువు, మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించింది. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. రెండు స్థానాలకు పోటీ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నికైన స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మండలిలో విప్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు గడిచిన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం మండలి నగారాను మోగిస్తూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పట్టభద్రులు 78,892, ఉపాధ్యాయులు 6,212 మంది నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టుభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు నమోదును నవంబర్ నుంచి జనవరి 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో పట్టుభద్రులు 78,892 మంది, ఉపాధ్యాయులు 6,212 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను ఈనెల 20న ప్రకటించారు. పట్టభద్రులు కరీంనగర్లో 36,803, జగిత్యాలలో 16,098 మంది, పెద్దపల్లిలో 15,739, సిరిసిల్లలో 10,252 మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో 3205 మంది, జగిత్యాలలో 1329 మంది, పెద్దపల్లిలో 910 మంది, రాజన్నసిరిసిల్లలో 768 మంది మాత్రమే ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల స్థానంపై గురి కరీంనగర్ పట్టుభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు ఆశావహులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ నగర మేయర్ రవీందర్‌సింగ్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కిమ్స్ విద్యాసంస్థల అధినేత పేర్యాల దేవేందర్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.చంద్రశేఖర్‌గౌడ్, బీజేపీ నుంచి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, కేజీటూపీజీ విద్యాసంస్థల జేఏసీ పక్షాన కడారు అనంతరెడ్డితోపాటు తదితరులు పోటీపడేందుకు వ్యూహరచనల్లో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటాపోటీ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటాపోటీ నెలకొంది. రెండుసార్లు కరీంనగర్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన పాతూరి సుధాకర్‌రెడ్డిని తిరిగి టీఆర్ఎస్ పక్షాన నిలిపేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు వినికిడి. కాంగ్రెస్ పార్టీ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ పక్షాన మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నుంచి మామిడి సుధాకర్‌రెడ్డి, పీఆర్టీయూ నుంచి రఘోత్తమరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ నుంచి కొండల్‌రెడ్డి, టీడీడీఎఫ్, టీటీఎఫ్ల నుంచి సీహెచ్.రాములు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. -
‘పెద్దల’పై అనాసక్తి..
ఆదిలాబాద్‌అర్బన్: పెద్దల సభ ఎలక్షన్ నేపథ్యంలో ఓటు ఆవశక్యతపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతో నమోదుకు పట్టభధ్రులు, ఉపాధ్యాయులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఓటు నమోదులో జిల్లా వెనకబడింది. ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఓటు నమోదు బాగానే జరిగినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ముందుకు రావడం లేదు. ఓటు నమోదు తక్కువగా జరగడంతో ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. గడువు ఈనెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా పాత ఓటర్ల సంఖ్య 34,557గా ఉంది. దీనికి అనుగుణంగా దరఖాస్తులు రాకపోయినా.. కనీసం అందులో సగం మంది ఓటర్లు కూడా ఈసారి నమోదు చేసుకోకపోవడం గమనార్హం. మండలి ఓటు నమోదుపై ప్రచారం లేకనే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి స్పందన రావడం లేదని గ్రహించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వతహాగా ప్రచారం చేపట్టినా ఆశించిన మేర నమోదు కాలేదు. కాగా ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువ శాతం పట్టభద్రులే ఉన్నారు. ఇందులో కొంత మంది ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేకపోవడం గమనించదగ్గ విషయం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో జిల్లా యంత్రాంగం ఉండడం, మండలి ఓటరు నమోదుపై ప్రచారం లేకపోవడం.. వెరసి ఈసారి ఎమ్మెల్సీ ఓటర్లు తక్కువగా నమోదయ్యారు. పాత జిల్లాలో 34,557 ఓట్లు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 34,557 మంది ఉన్నారు. ఇందులో 30,488 మంది పట్టభద్రులు ఉండగా, 4,069 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఈఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ 6 వరకు జరిగిన ప్రక్రియ ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 10,150 మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 1,550 నుంచి 1,950 మంది వరకు ఓటరుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా 2013లో చేపట్టిన ఎమ్మెల్సీ ఓటరు నమోదులో కన్పించిన జోరు.. ఈసారి కనిపించడం లేదు. నమోదుపై క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో అధిక సంఖ్యలో ఉన్న పట్టభద్రులు ముందుకు రాలేకపోయారు. ఈ నెల 6 వరకు జరిగిన ఓటు నమోదు సమయంలో ఆన్లైన్ మొరాయించిన విషయం తెలిసిందే. దాన్ని సాకుగా చూపుతూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఎంత మంది పట్టభద్రులు, ఎంత మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారో కూడా తెలియదని సమాధానం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అభ్యర్థులే ప్రచార సారథులు.. 2019 మార్చి చివరి నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలవాలని భావిస్తున్న వారే శాసన మండలి నియోజకవర్గ ఓటరు నమోదుపై ప్రచారం చేయాల్సి వస్తోంది. ఓటరు నమోదు సమయంలో గత నెలాఖరులో నిర్మల్ జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి పనిలో పనిగా ఆదిలాబాద్‌కు సైతం వచ్చి వెళ్లారు. వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్రమత్తం కావాల్సి ఉందని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం. దీని దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా తీరుగానే ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రచారం నిర్వహిస్తే తప్పా పట్టభద్రులు ఓటు కోసం పోటెత్తే అవకాశం కన్పించడం లేదు. ఎమ్మెల్సీ ఓటు నమోదు ఇలా.. ఎమ్మెల్సీ ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలనుకునే వారు ఠీఠీఠీ. ఛ్ఛిౌ ్ట్ఛ ్చnజ్చn్చ. nజీఛి. జీn లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. లేదా నేరుగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటు హక్కు పొందడానికి అర్హులు. 2012 నవంబర్ 1 నుంచి ఈఏడాది నవంబర్ 1 వరకు ఆరేళ్లలో మూడేళ్లకు తగ్గకుండా గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో బోధన అనుభవం ఉన్న వారు ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందడానికి అర్హులు. 19 వరకు గడువు పొడిగింపు.. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 6తో ముగిసిన నమోదు ప్రక్రియను ఈనెల 19 వరకు పొడగించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి గతంలో ఓటేసినా ఇప్పుడు మళ్లీ తప్పక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రులు ఫారం– 18, ఉపాధ్యాయులు ఫారం– 19ను పూర్తి చేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఓటు హక్కు పొందే వారు పట్టభద్రుల ఓటు పొందడానికి అర్హులవుతారు. అయితే వారు ఫారం– 18, 19ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా జిల్లా అధికారులకు గడువు పొడిగింపు సమాచారం అధికారికంగా అందాల్సి ఉంది. -
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
-
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
తూర్పు రాయలసీమలో ‘విఠపు’, పశ్చిమ రాయలసీమలో ‘కత్తి’ ఘనవిజయం సాక్షి, చిత్తూరు/సాక్షి, ప్రతినిధి, అనంతపురం/సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో విఠపు బాలసుబ్రహ్మణ్యం.. తన సమీప ప్రత్యర్థి, అధికార టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక ఓటమి పాలయ్యారు. కత్తి నరసింహారెడ్డికి 3,763 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. -
మండలి పోలింగ్ ప్రశాంతం
పటిష్టంగా పోలీస్ బందోబస్త్ ఓటుహక్కును వినియోగించుకున్న 7,404 మంది పోలింగ్ తీరును పర్యవేక్షించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ వేలేరుపాడులో 4 గురు, కుకునూరులో 11 మంది ఓటింగ్ ఏలూరు సిటీ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలను తలపిస్తూ అధికార టీడీపీ శ్రేణులు ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచీ మోహరించాయి. జిల్లావ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో 7,404 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 79 శాతం పోలింగ్ నమోదు అయింది. కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ తీరును ఎప్పకప్పుడు పర్యవేక్షించారు. ఏలూరు గ్జేవియర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాము సూర్యారావు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ముందుస్తు చర్యలు చేపట్టామని 850 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించామని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. ఇక ఓటర్ల జాబితాలో ఎప్పుడో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పేర్లు ఉండడంతో ఎన్నికల అధికారులకు కాస్త తలనొప్పిగా మారింది. యూటీఎఫ్ మద్దతుతో పోటీలో ఉన్న రాము సూర్యారావు ఏలూరులోని గ్జేవియర్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లగా ఎన్నికల అధికారులు నిరాకరించారు. 2007లో పదవీ విరమణ చేసిన ఆయన నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటినందున ఓటు వేయకూడదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఓటర్ల జాబితాలో తన పేరు ఉన్నందున ఓటు వేస్తానని ఆయన అనడంతో కలెక్టర్ అనుమతించారు. దీంతో ఆయన ఉదయం 11.30 గంటలు దాటాక ఓటు వేశారు. మెల్లగా సా...గింది ఎమ్మెల్సీ పోలింగ్ నత్తనడకన సాగింది. ఉదయం 8 గంటలకే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినా ఓటర్లు మాత్రం తాపీగా కేంద్రాలకు వచ్చారు. ఉదయం 10 గంటలకు జిల్లాలో 21.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో 4,813 మంది ఓటు వేయగా 51.34 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక రెండు గంటలకు 68.01 శాతం పోలింగ్‌తో 6,384 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో 7,404 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో పురుష ఓటర్లు 4,722 మంది, మహిళా ఓటర్లు 2,682 మంది ఉన్నారు. వేలేరుపాడులో 4గురు జిల్లాలోని వేలేరుపాడులో నలుగురు ఓటర్లు మాత్రమే ఉండగా వారి కోసం ఐదుగురు పోలింగ్ సిబ్బంది, పదిమంది పోలీసులు విధులు నిర్వహించారు. వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళా ఓటరు ఉన్నారు. ఈ నలుగురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కుకునూరులో 14 మంది ఓటర్లు ఉండగా 11మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని ఏలూరు డివిజన్లో 17 పోలింగ్ కేంద్రాల్లో 74.19 శాతం పోలింగ్ నమోదు అయింది. 3,406 మంది ఓటర్లకు గానూ 2,527 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1,473, మహిళా ఓటర్లు 1,054 మంది ఉన్నారు. కొవ్వూరు డివిజన్లో 12 పోలింగ్ కేంద్రాల్లో 76.26 శాతం పోలింగ్ నమోదు అయింది. 2,123 మంది ఓటర్లు ఉండగా 1,619 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1,066 మంది, మహిళలు 553 మంది ఉన్నారు. నరసాపురం డివిజన్లో 12 పోలింగ్ కేంద్రాల్లో 84.32 శాతం పోలింగ్ నమోదు అయింది. 2,902 మంది ఓటర్లు ఉంటే 2,447 మంది ఓటు వేశారు. వారిలో 1,653 మంది పురుష ఓటర్లు, 794 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో 8 పోలింగ్ కేంద్రాల్లో 85.91 శాతం పోలింగ్ నమోదు అయింది. 944 మంది ఓటర్లు ఉంటే 811 మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 530 మంది పురుష ఓటర్లు, 281 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. -
పోరు ముగిసింది..టెన్షన్ మిగిలింది..
అయినా గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. 25న కాకినాడలో కౌంటింగ్ సాక్షి ప్రతినిధి, కాకినాడ :రెండున్నర నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజితులవుతారోనన్న టెన్షన్ మిగిలింది. ఈ ఉత్కంఠకు కూడా ఈ నెల 25న తెర పడుతుంది. బరిలో 15 మంది అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ ముగ్గురి మధ్యనే ఉంది. వీరిలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు వరకూ వెళ్లాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు బూత్‌లవారీగా మద్దతుదారుల ద్వారా రప్పించుకున్న సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ.. గెలుపు ఓటములను బేరీజు వేసుకునే పనిలో పడ్డారు. పోలింగ్ సరళి చూస్తుంటే తమకే అవకాశాలు బాగున్నాయంటూ ఎవరికి వారే చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 83.71 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ పోలింగ్ శాతం పెరుగుదల వల్ల తమకే కలసివస్తుందంటూ ప్రధాన పోటీదారులు అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 74 శాతం ఓట్లు పోలవగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 70 శాతం నమోదైంది. ఈసారి పశ్చిమ గోదావరిలో 85 శాతం, తూర్పు గోదావరిలో 82.71 శాతం నమోదైంది. ‘పశ్చిమ’లో పెరిగిన ఓటింగ్ ఎవరికి కలిసి వస్తుందనేదానిపైనా లెక్కలు తీస్తున్నారు. ఇందుకోసం దాదాపు అభ్యర్థులంతా పోలింగ్ బూత్లవద్దకు వెళ్లి తమ అవకాశాలను అంచనా వేసుకోవడం కనిపించింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చైతన్యరాజు కాకినాడ సిటీ, రూరల్, సామర్లకోట, పెద్దాపురం, రంగంపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చైతన్యరాజు తనయుడు, ఎమ్మెల్సీ రవివర్మ కాకినాడ సిటీ, కరప, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు, అమలాపురంలోను, మరో తనయుడు, గైట్ ఎమ్డీ శశివర్మ జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం తదితర ప్రాంతాల్లోను పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పర్యటించగా, యూటీఎఫ్ మద్దతుతో పోటీ చేసిన రాము సూర్యారావు పశ్చిమ గోదావరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ముగ్గురే ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఏదెలా ఉన్నా మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ఎటువంటి తీర్పు ఇచ్చారో, ఎవరి తలరాతలు ఎలా మార్చేస్తారో తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. చేసిన పనులే గెలిపిస్తున్నాయి ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల కోసం చేసిన సేవలే నన్ను విజయానికి చేరువ చేస్తున్నాయి. ఉపాధ్యాయ వర్గంతో ఆది నుంచీ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలపట్ల సానుకూలంగా స్పందించడంతో వారంతా వెన్నంటి నిలిచారు. గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నాతో ఉపాధ్యాయులకున్న స్నేహబంధం ముందు అవన్నీ దిగదుడుపే. - చైతన్యరాజు మొదటి ప్రాధాన్యంతోనే గెలుస్తా మొదటి ప్రాధాన్య ఓటుతోనే విజయం సాధిస్తాను. ఇతర అభ్యర్థుల విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నిజాయితీకి, నిబద్ధతకు ఉపాధ్యాయులు పట్టం కట్టేశారు. అందరి సహకారంతో విజయం సాధించడం ఖాయమనే ధీమాతో ఉన్నా. - రాము సూర్యారావు విజయం నాదే.. పోలింగ్ సరళిని పరిశీలిస్తే విజయం నాదేనన్న నమ్మకం ఉంది. మేథావులైన ఉపాధ్యాయులు పెద్దల సభకు ఎలాంటి అభ్యర్థిని పంపితే తమకు న్యాయం జరుగుతుందనే అంశంపై బాగా ఆలోచించి ఓటు వేశారు. రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఉపాధ్యాయులు మాత్రం ఆలోచించి ఓటు వేసినట్టుగానే కనిపిస్తోంది. - డాక్టర్ పరుచూరి కృష్ణారావు -
ఓటెత్తిన టీచర్లు
ఉపాధ్యాయులు ‘ఓటె’త్తారు. శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాకినాడ సిటీ :శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 83.71 శాతం పోలింగ్ నమోదవగా ‘తూర్పు’న 82.71 శాతం, ‘పశ్చిమ’లో 85 శాతం నమోదైంది. మొత్తం రెండు జిల్లాల్లోని 117 పోలింగ్ కేంద్రాల పరిధిలో 21,551 మంది ఓటర్లు ఉండగా 18,040 ఓట్లు పోలయ్యాయి. ‘తూర్పు’లో 12,176 మంది ఓటర్లకు 10,071 మంది, ‘పశ్చిమ’లో 9,375 మందికి 7,969 మంది ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచే పలుచోట్ల ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చాలామంది ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రారంభం నుంచీ పోలింగ్ శాతం పెరుగుతూనే వచ్చింది. కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉదయమే బారులు తీరారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రెండో కంపార్టుమెంట్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. దీంతో మధ్యాహ్ననికి రద్దీ తగ్గింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహించారు. వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టరేట్ కోర్టు హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్నికల విభాగంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు. మరోపక్క కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎన్నికల పరిశీల కులు ఎం.జగన్నాథం కలెక్టరేట్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షి స్తూ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. వారిద్దరూ కాకినాడ నగరంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ తీరును పరిశీలించారు. మరోపక్క పోటీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు, మరో అభ్యర్థి పరుచూరి కృష్ణారావులు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కాకినాడ డివిజన్లో 3,364 ఓట్లకు 2,822, పోలయ్యాయి. పెద్దాపురం డివిజన్లో 1,044 ఓట్లకు 978, రాజమండ్రి డివిజన్లో 2,839 ఓట్లకు 2,029, రామచంద్రపురం డివిజన్లో 1,214 ఓట్లకు 1,082, అమలాపురం డివిజన్లో 2,962 ఓట్లకు 2,590, రంపచోడవరం డివిజన్లో 753 ఓట్లకు 570 పోలయ్యాయి. పిఠాపురంలో మద్యంషాపు సీజ్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20 సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకూ జిల్లాలో మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పిఠాపురం పట్టణంలోని దుర్గా వైన్‌షాపులో దీనిని ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహించారు. దీనిపై మీడియాలో స్క్రోలింగ్‌లు చూసిన కలెక్టర్ స్పందించి తక్షణం షాపు యజమానిపై చర్యలు తీసుకుని, లెసైన్సు రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో మద్యం షాపును సీజ్ చేసి, షాపు యజమాని దామోదర్‌రావుతోపాటు బోయ్ శ్రీనివాసరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అలాగే రాజమండ్రి నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఆర్కేఆర్ వైన్స్‌షాపు సిబ్బంది పక్కనుంచి మద్యం అమ్మకాలు చేస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. దానిపై దాడి చేసి రూ.3.10 లక్షల విలువ చేసే 120 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ సరళి సాగిందిలా... సమయం పోలైన ఓట్లు శాతం ఉదయం 10 గంటలకు 4,766 22.11 మధ్యాహ్నం 12 గంటలకు 11,205 51.99 మధ్యాహ్నం 2 గంటకు 14,900 69.14 సాయంత్రం 4 గంటలకు 18,040 83.71