అయినా గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
25న కాకినాడలో కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రెండున్నర నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజితులవుతారోనన్న టెన్షన్ మిగిలింది. ఈ ఉత్కంఠకు కూడా ఈ నెల 25న తెర పడుతుంది. బరిలో 15 మంది అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ ముగ్గురి మధ్యనే ఉంది. వీరిలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు వరకూ వెళ్లాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు బూత్‌లవారీగా మద్దతుదారుల ద్వారా రప్పించుకున్న సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ.. గెలుపు ఓటములను బేరీజు వేసుకునే పనిలో పడ్డారు.
పోలింగ్ సరళి చూస్తుంటే తమకే అవకాశాలు బాగున్నాయంటూ ఎవరికి వారే చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 83.71 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ పోలింగ్ శాతం పెరుగుదల వల్ల తమకే కలసివస్తుందంటూ ప్రధాన పోటీదారులు అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 74 శాతం ఓట్లు పోలవగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 70 శాతం నమోదైంది. ఈసారి పశ్చిమ గోదావరిలో 85 శాతం, తూర్పు గోదావరిలో 82.71 శాతం నమోదైంది. ‘పశ్చిమ’లో పెరిగిన ఓటింగ్ ఎవరికి కలిసి వస్తుందనేదానిపైనా లెక్కలు తీస్తున్నారు. ఇందుకోసం దాదాపు అభ్యర్థులంతా పోలింగ్ బూత్‌లవద్దకు వెళ్లి తమ అవకాశాలను అంచనా వేసుకోవడం కనిపించింది.
టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చైతన్యరాజు కాకినాడ సిటీ, రూరల్, సామర్లకోట, పెద్దాపురం, రంగంపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చైతన్యరాజు తనయుడు, ఎమ్మెల్సీ రవివర్మ కాకినాడ సిటీ, కరప, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు, అమలాపురంలోను, మరో తనయుడు, గైట్ ఎమ్‌డీ శశివర్మ జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం తదితర ప్రాంతాల్లోను పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు కాకినాడ సిటీ, రూరల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పర్యటించగా, యూటీఎఫ్ మద్దతుతో పోటీ చేసిన రాము సూర్యారావు పశ్చిమ గోదావరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ముగ్గురే ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఏదెలా ఉన్నా మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ఎటువంటి తీర్పు ఇచ్చారో, ఎవరి తలరాతలు ఎలా మార్చేస్తారో తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
చేసిన పనులే గెలిపిస్తున్నాయి
ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల కోసం చేసిన సేవలే నన్ను విజయానికి చేరువ చేస్తున్నాయి. ఉపాధ్యాయ వర్గంతో ఆది నుంచీ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలపట్ల సానుకూలంగా స్పందించడంతో వారంతా వెన్నంటి నిలిచారు. గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా నాతో ఉపాధ్యాయులకున్న స్నేహబంధం ముందు అవన్నీ దిగదుడుపే.
- చైతన్యరాజు
మొదటి ప్రాధాన్యంతోనే గెలుస్తా
మొదటి ప్రాధాన్య ఓటుతోనే విజయం సాధిస్తాను. ఇతర అభ్యర్థుల విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నిజాయితీకి, నిబద్ధతకు ఉపాధ్యాయులు పట్టం కట్టేశారు. అందరి సహకారంతో విజయం సాధించడం ఖాయమనే ధీమాతో ఉన్నా.
- రాము సూర్యారావు
విజయం నాదే..
పోలింగ్ సరళిని పరిశీలిస్తే విజయం నాదేనన్న నమ్మకం ఉంది. మేథావులైన ఉపాధ్యాయులు పెద్దల సభకు ఎలాంటి అభ్యర్థిని పంపితే తమకు న్యాయం జరుగుతుందనే అంశంపై బాగా ఆలోచించి ఓటు వేశారు. రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఉపాధ్యాయులు మాత్రం ఆలోచించి ఓటు వేసినట్టుగానే కనిపిస్తోంది.
- డాక్టర్ పరుచూరి కృష్ణారావు
పోరు ముగిసింది..టెన్షన్ మిగిలింది..
Published Mon, Mar 23 2015 2:48 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement