కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం మండలి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి, ఉపా«ధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుదిగడువు, మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించింది. మార్చి 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది.
రెండు స్థానాలకు పోటీ
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నికైన స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మండలిలో విప్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు గడిచిన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం మండలి నగారాను మోగిస్తూ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
పట్టభద్రులు 78,892, ఉపాధ్యాయులు 6,212 మంది నమోదు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టుభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు నమోదును నవంబర్ నుంచి జనవరి 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో పట్టుభద్రులు 78,892 మంది, ఉపాధ్యాయులు 6,212 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను ఈనెల 20న ప్రకటించారు. పట్టభద్రులు కరీంనగర్‌లో 36,803, జగిత్యాలలో 16,098 మంది, పెద్దపల్లిలో 15,739, సిరిసిల్లలో 10,252 మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో 3205 మంది, జగిత్యాలలో 1329 మంది, పెద్దపల్లిలో 910 మంది, రాజన్నసిరిసిల్లలో 768 మంది మాత్రమే ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.
పట్టభద్రుల స్థానంపై గురి
కరీంనగర్ పట్టుభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు ఆశావహులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జీవన్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ నుంచి కరీంనగర్ నగర మేయర్ రవీందర్‌సింగ్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కిమ్స్ విద్యాసంస్థల అధినేత పేర్యాల దేవేందర్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.చంద్రశేఖర్‌గౌడ్, బీజేపీ నుంచి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, కేజీటూపీజీ విద్యాసంస్థల జేఏసీ పక్షాన కడారు అనంతరెడ్డితోపాటు తదితరులు పోటీపడేందుకు వ్యూహరచనల్లో ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటాపోటీ
కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటాపోటీ నెలకొంది. రెండుసార్లు కరీంనగర్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన పాతూరి సుధాకర్‌రెడ్డిని తిరిగి టీఆర్‌ఎస్ పక్షాన నిలిపేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు వినికిడి. కాంగ్రెస్ పార్టీ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ పక్షాన మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నుంచి మామిడి సుధాకర్‌రెడ్డి, పీఆర్‌టీయూ నుంచి రఘోత్తమరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ నుంచి కొండల్‌రెడ్డి, టీడీడీఎఫ్, టీటీఎఫ్‌ల నుంచి సీహెచ్.రాములు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment