ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, గాయకుడు, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారా? సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా మేధావిగా పేరున్న ఉద్యమకారుడిని బరిలో నిలిపి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకునేందుకు పావులు కదుపుతున్నారా? ప్రగతి భవన్ కేంద్రంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఇవి నిజమేనని అనిపిస్తోంది.
నోటిఫికేషన్ జారీ
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్‌టీయూ నుంచి పోటీ చేస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపికపై కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యం కలిగి, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని మేధావి వర్గానికి చెందిన వ్యక్తిని పెద్దల సభకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.
సిద్ధిపేట వాస్తవ్యుడైన దేశపతి శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‌కుఅత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన దేశపతి శ్రీనివాస్ ఉద్యమ సమయంలో హృదయాలను కదిలించేలా పాటలు రాయడంతో పాడి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా అధికార హోదాలో వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని దేశపతిని శాసనమండలికి పంపించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. దేశపతి పెద్దల సభకు అడుగుపెడితే శాసనమండలి హుందాతనం పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు..
సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జీవన్‌రెడ్డికి సమన్వయకర్తగా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని 42 శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించిన ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో కొన్ని సీట్లు దక్కాయి. అదే సమయంలో జీవన్‌రెడ్డి ఓటమి పాలు కావడంతో ఆయన పట్ల కొంత సానుభూతి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చే నాయకుల విషయంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇతర విద్యావంతులు ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు దేశపతి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్వామి గౌడ్ పేరు సైతం
శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఆరేళ్ల క్రితం ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. శాసనమండలిలో ఆయనకు చైర్మన్ హోదా ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి మరోసారి పెద్దల సభకు పంపే అవకాశాలను కూడా టీఆర్‌ఎస్ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగిన పాతూరి సుధాకర్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చినట్టుగానే , చివరి నిమిషయంలో స్వామిగౌడ్‌కు సైతం అవకాశం దక్కుతుందేమోనని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరితో పాటు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇన్‌చార్జి డీటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ తదితరులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment