desapati srinivas
-
ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గుత్తా, కడియం ముందు వరుసలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. భారీగానే జాబితా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
పట్టభద్రుల దళపతి.. దేశపతి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, గాయకుడు, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారా? సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా మేధావిగా పేరున్న ఉద్యమకారుడిని బరిలో నిలిపి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకునేందుకు పావులు కదుపుతున్నారా? ప్రగతి భవన్ కేంద్రంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఇవి నిజమేనని అనిపిస్తోంది. నోటిఫికేషన్ జారీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్టీయూ నుంచి పోటీ చేస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపికపై కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యం కలిగి, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని మేధావి వర్గానికి చెందిన వ్యక్తిని పెద్దల సభకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. సిద్ధిపేట వాస్తవ్యుడైన దేశపతి శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‌కుఅత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన దేశపతి శ్రీనివాస్ ఉద్యమ సమయంలో హృదయాలను కదిలించేలా పాటలు రాయడంతో పాడి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా అధికార హోదాలో వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని దేశపతిని శాసనమండలికి పంపించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. దేశపతి పెద్దల సభకు అడుగుపెడితే శాసనమండలి హుందాతనం పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు.. సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జీవన్‌రెడ్డికి సమన్వయకర్తగా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని 42 శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించిన ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో కొన్ని సీట్లు దక్కాయి. అదే సమయంలో జీవన్‌రెడ్డి ఓటమి పాలు కావడంతో ఆయన పట్ల కొంత సానుభూతి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే నాయకుల విషయంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇతర విద్యావంతులు ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఢీకొనేందుకు దేశపతి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్వామి గౌడ్ పేరు సైతం శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఆరేళ్ల క్రితం ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. శాసనమండలిలో ఆయనకు చైర్మన్ హోదా ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి మరోసారి పెద్దల సభకు పంపే అవకాశాలను కూడా టీఆర్ఎస్ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగిన పాతూరి సుధాకర్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చినట్టుగానే , చివరి నిమిషయంలో స్వామిగౌడ్‌కు సైతం అవకాశం దక్కుతుందేమోనని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరితో పాటు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇన్చార్జి డీటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ తదితరులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు మహా సభల సన్నాహక సదస్సు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు. మురళి ధర్మపురి, ప్రవీణ్ పిన్నమ సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల కో ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్.వీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 'తెలంగాణలో ప్రకాశించిన తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని చాటేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రముఖ కవి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలుగు మహాసభల కోసం సిడ్నీ నగరంలో బెల్ హెవన్స్ హోటల్ లో జరిగిన సన్నాహక సమావేశానికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణలో సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు నుడికారం ఎంతో అందంగా కవితాత్మకంగా ఉంటుందని దేశపతి శ్రీనివాస్ సోదాహరణంగా వివరించారు. పాల్కురికి సోమనాథుడు, పోతన, దాశరథి, సినారెల గురించి పాటలు పడుతూ దేశపతి శ్రీనివాస్ చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా నుండి వచ్చే అతిథులందరికి తెలంగాణ గౌరవ మర్యాదలు ఉట్టిపడే విధంగా ఆతిథ్యం ఇస్తామని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వీ సత్యనారాయణ ప్రకటించారు. తెలంగాణ సాహిత్య చరిత్రలో నిర్మాణంలో ఉన్న ఖాళీలను పూరించడం, విస్మరణకు గురైన అంశాలను వెలుగులోకి తేవడం కోసమే తెలుగు మహాసభలు అని పేర్కొన్నారు. సభలో రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా అందరు పాల్గొనడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషా ప్రియులు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన ఈ తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం తెలుగు వారంతా స్వాగతించాల్సిన విషయం అని, ఇందుకు యావత్ తెలుగు జాతి మిమ్మల్ని అభినందిస్తున్నదని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కాసర్ల పేర్కొన్నారు. అంతే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాలకు అందించేందుకు, బాషా ఔన్నత్వం మరింతగా కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఎన్నారైలు గా మేము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియాలోని ప్రవాస సంఘాల మరియు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. -
ఆ 11మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు
హైదరాబాద్ : పీఎస్లుగా ఉన్న 11మంది ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగ్‌లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌కు ములుగు మండలం క్షీరసాగర్‌లో పోస్టింగ్ ఇచ్చింది. కాగా ఉపాధ్యాయులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏ, పీఎస్లుగా కొనసాగేందుకు వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.. వారంలోగా పాఠశాలలకు వారిని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టీచర్లను పీఎస్లుగా తొలగించింది. వీరంతా అక్టోబర్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలి. -
నేడు కోదాడలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
కోదాడటౌన్, న్యూస్‌లైన్ : కోదాడలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని నాగార్జున సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తోపాటు ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌తో పాటు గాదరి కిశోర్, జగదీశ్వరరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పదివేల మంది విద్యార్థులతో కోదాడలో మహాప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్ఎస్, జేఏసీ నాయకులు తెలిపారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శశిధర్ పట్టణంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో రావాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో మట్టపల్లి శ్రీనివాసగౌడ్, కుక్కడపు బాబు, తుపాకుల భాస్కర్, యల్లేశ్వరరావు, మైసయ్య, అంజయ్య, జేఏసీ నాయకులు పందిరి నాగిరెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాయలకు ఒప్పుకోం
వర్గల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకోబోమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గౌరారంలో జరిగిన వర్గల్, ములుగు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కిరికిరి పెడితే మరో పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామాలతో పదవీ త్యాగం చేయాలంటే పారిపోయినవారు తెలంగాణ పేరిట సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని నాయిని ధ్వజమెత్తారు. మద్రాస్ రాష్ట్రంలో తమకు అటెండర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోరిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల ఉద్యోగాలను అనుభావిస్తున్నారని అన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రేమ, అనురాగాల ప్రాధాన్యత తెలియదని, సీఎం పదవి కోసం పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడని ఎదేవా చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలతోనే తెలంగాణ ఆవిర్భావం జరుగనుందన్నారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణే మాలక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సరేష్‌గౌడ్, ఎలక్షన్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.