- కౌన్సిల్‌లో కార్పొరేటర్ కు భంగపాటు
- ఆదికేశవులునాయుడు ఫొటోతో ధర్నా
- పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగానికి మళ్లీ తెరతీసింది. ఇప్పటికే నగర మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే సత్యప్రభ మధ్య ఉన్న విభేదాలు తార స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా కార్పొరేటర్ల మధ్య కూడా వర్గవిభేదాలు పొడచూపాయి. శనివారం చిత్తూరులో కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటైన ప్రత్యేక సమావేశం ఇందుకు వేదికయింది. సమావేశం ప్రారంభమవగానే ఎమ్మెల్యేలు లేరని, కో-ఆప్ష న్ సభ్యుల జాబితా ఇవ్వనందున సమావేశం వాయిదా వేయాలని సభ్యులు పట్టుబట్టారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
అయితే దీనిపై 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు (టీడీపీ) అభ్యంతరం వ్యక్తం చేశారు. తన డివిజన్‌లో మూడిళ్లకు ఒక నీటి ట్యాంకరు వస్తోందని, వార్డు సమస్యలు తీర్చడంలో పాలకవర్గం, అధికారులు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఇంతలో పక్కనున్న కొందరు కార్పొరేటర్లు(టీడీపీ) కల్పించుకుని ఇందును కూర్చోమని వారించారు. ఆమె సమస్యలను ప్రస్తావిస్తుండగానే సభ్యులంతా లేచి వెళ్లిపోయారు. దీంతో ఇందు తీవ్ర మనస్తాపానికి గురై కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు ఫొటో పెట్టుకుని నిరసన వ్యక్తం చేశా రు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతం లో చిత్తూరు కార్పొరేషన్‌లో ఉన్న అవినీతి ఇప్పుడు కూడా కొనసాగుతోందన్నారు. మహి ళా కార్పొరేటర్‌గా సమస్యల్ని ప్రస్తావిస్తుంటే కొందరు సభ్యులు తనను అడ్డుకోవడం, గదమాయించడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. పెద్దల అండ ఉంటే కావాల్సిన వారికి పాలకవర్గం అన్ని పనులు చేస్తోందని దుయ్యబట్టారు.
తమలాంటి బడుగులకు ఇక్కడ మాట్లాడే హక్కు కూడా కల్పించకపోవడం అన్యాయమన్నారు. మహిళా మేయర్ ఉన్న కార్పొరేషన్‌లో సాటి మహిళను అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించి తీరుతానని స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వచ్చి సర్ది చెప్పడంతో ఇందు నిరసన విరమించారు.
కుదరని సయోధ్య...
చిత్తూరు నగర పాలక సంస్థ పాలకవర్గంలో 38 మంది టీడీపీ కార్పొరేటర్లు, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, 8 మంది స్వతంత్రులు. ఏ ఒక్క అంశాన్నైనా ఆమోదించాలన్నా, తిరస్కరించాలన్నా టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రతిపక్షమో, స్వతంత్య్ర అభ్యర్థులో చేయాలి. కానీ పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ సభ్యుల మధ్య సఖ్యతను అనుమానించే విధంగా ఉంది. ఇటీవల పాలక మం డలి కౌన్సిల్ సమావేశాల్లో చోటు చేసుకుం టున్న సంఘటనలు ఇందుకు నిదర్శనం.
కౌన్సిల్ సమావేశానికి ముందుగానే సమావేశంలో ఏయే అంశాలకు సంబంధించి నోట్‌ఫైల్ పెట్టాలో అధికారులు మేయర్‌తో చర్చించి అజెండాలో చేరుస్తారు. ఈ నెల 11న జరిగిన చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 36 అంశాలను మేయర్ అనుమతితోనే అధికారులు అజెండాలో ఉంచారు. మేయర్ సంతకంతో కార్పొరేటర్లకు ప్రతులు అందాయి. అం టే దాదాపు అన్ని అంశాల్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లే అవుతుంది. కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చే సరికి 36 అంశాల్లో 26 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన పది అంశాలు ఆమోదం పొందలేదు.
ఇక శనివారం కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడింది. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు సభకు రాలేరని, కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల జాబితా ఇవ్వలేద ని సమావేశం వాయిదా వేశారు. కానీ వాస్తవానికి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మేయర్ అనుమతితో ఈ నెల 21వ తేదీనే సమావేశం నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు.
అయితే సీఎంతో మేయర్ భేటీ ఉండటంతో, మేయర్ అభ్యర్థన మేరకు 23న ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి అధికారులు తేదీ మార్చారు. తీరా సమావేశానికి సభ్యులు హాజరైన తరువాత అసెంబ్లీ ఉందని, తమకు తుది జాబితా అందలేదని చెబుతూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ పరిణామాలు టీడీపీ కార్పొరేటర్ల మధ్య వర్గ విభేదాలకు ఆజ్యం పోశాయూనే విషయూన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.