- పింఛన్ సొమ్ము స్వాహా
- లబోదిబోమంటున్న వృద్ధులు, వికలాంగులు
- పట్టించుకోని అధికారులు
రేపోమాపో రాలిపోయే ఎండుటాకులు కొందరు... పరుల సహాయం లేనిదే పదడుగులన్నా వేయలేని నిస్సహాయులు మరికొందరు...జీవిత చరమాంకంలో ఉన్న వీరు బతికేందుకు ప్రభుత్వం ఎంతో కొంత పింఛన్ ఇస్తోంది . అయితే ఓ కౌన్సిలర్ భర్త కక్కుర్తి నిర్వాకానికి వీరంతా బలయిపోయారు. వీరికొచ్చే ఆ అరకొర పింఛన్ కాస్తా ఈ ‘మహానుభావుడు’ మింగేశాడు.
మచిలీపట్నం : పేదలకు అందాల్సిన పింఛన్ల సొమ్ము పెద్దల పరమవుతోంది. అధికారులను, పింఛను ఇచ్చే సీఎస్‌పీలను గుప్పెట్లో పెట్టుకున్న వార్డు స్థాయి నాయకులు చక్రం తిప్పుతున్నారు. వృద్ధులకు రూ.200 నుంచి రూ.1,000కి, వికలాంగులకు రూ. 500 నుంచి రూ.1,500కు పెంచి ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కాసులకు కక్కుర్తిపడ్డ కొంతమంది కౌన్సిలర్లు, వారి భర్తలు పింఛన్లు పేదలకు అందకుండా స్వాహా చేస్తున్నారు.
మచిలీపట్నం పురపాలక సంఘంలో కోనేరుసెంటరుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వార్డు కౌన్సిలర్ భర్త 50 మందికి చెందిన పింఛన్లను జేబులో వేసుకున్నట్లు బయటకు పొక్కింది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ 50 మందిలో 49 మంది రూ.1,000 పింఛను తీసుకునేవారు కాగా, మరొకరిది వికలాంగ పింఛను ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కౌన్సిలర్ భర్త మొదటి నెలలో రూ. 5వేలు, రెండో నెలలో రూ. 9వేలు, మూడో నెలలో ఏకంగా రూ.49,500లు కాజేయడం విమర్శలకు దారితీస్తోంది.
అన్నీ తానై వ్యవహరిస్తూ...
కోనేరుసెంటరు సమీపంలో ఉన్న వార్డులో 376 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీటిలో తొమ్మిది మందికి పింఛన్లను వివిధ కారణాలతో నిలిపివేశారు. లబ్ధిదారులు తమకు అన్నీ అర్హతలు ఉన్నాయని చెప్పడంతో ముగ్గురికి మళ్లీ పింఛను ఇచ్చేందుకు అంగీకరించారు. జన్మభూమి కార్యక్రమంలో కోనేరుసెంటరుకు సమీపంలోని వార్డుకు, మరో వార్డుకు కలిపి ఒకేచోట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన కౌన్సిలర్ భర్త.. తన వార్డుకు సంబంధించిన ఎక్విడెన్స్ రిజిస్టర్‌ను సీఎస్‌పీ నుంచి తీసేసుకున్నట్లు సమాచారం. నగదు సీఎస్‌పీ వద్ద ఉంచి సొంత నగదును పింఛన్‌దారులకు అరకొర పంచాడని స్థానికులు చెప్పుకుంటున్నారు.
అనంతరం సీఎస్‌పీ వద్దకు వచ్చి జాబితాలో ఉన్న సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు మొత్తాన్ని వసూలు చేసుకున్నాడని తెలిసింది. అయితే ఫినోమిషన్‌పై వేలిముద్రలు వేయడంతో పాటు ఎక్విడెన్స్ రిజిస్టర్‌లో నగదు తమకు అందినట్లు లబ్ధిదారులు వేలిముద్రలు లేదా సంతకం చేయాల్సి ఉంది. 50 మందికి సంబంధించిన పింఛను నగదును కాజేసిన కౌన్సిలర్ భర్త.. తన అనుచరులతో వేలి ముద్రలు వేయించినట్లు విశ్వసనీయ సమాచారం. పింఛను సొమ్ము అందని వారు తమకు ఆ మొత్తాన్ని ఇప్పించాలని కౌన్సిలర్ భర్త చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
‘ప్రభుత్వం మాది, పాలకవర్గం మాది, అధికారులు మేము చెప్పినట్లు వినాల్సిందే...మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ కౌన్సిలర్ భర్త వీరంగం వేయడం గమనార్హం. కాగా ఇంత మందికి పింఛన్లు ఇవ్వకుంటే తాను ఇబ్బందుల పాలవుతానని కౌన్సిలర్ భర్తతో వార్డు సీఎస్పీ వాగ్వాదానికి దిగారు. ఆమెకు మొదటి విడతగా రూ.6 వేలు, రెండో విడతగా రూ.9 వేలు రూ.15 వేలు ఇచ్చి మిన్నకుండిపొమ్మని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సీఎస్పీ పురపాలకశాఖ అధికారులకు తెలియజేశారు. తాను ఈ వార్డులో పనిచేయలేనని, వేరే వార్డుకు బదిలీ చేయాలని మొరపెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్ భర్తను ఆదర్శంగా తీసుకున్న పక్కవార్డులో ఉన్న కౌన్సిలర్ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
మా దృష్టికి రాలేదు...
కోనేరుసెంటరు సమీపంలో ఉన్న వార్డులో వంద మందికి పింఛన్లు ఇచ్చినట్లు వేలిముద్రలు తీసుకుని నగదు ఇవ్వని విషయం మా దృష్టికి రాలేదు. అయినప్పటికీ సంబంధిత విభాగం అధికారి నుంచి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
- మారుతీ దివాకర్, మున్సిపల్ కమిషనర్