కౌంట్‌డౌన్! | count down! | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్!

Published Wed, Jul 2 2014 2:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

కౌంట్‌డౌన్! - Sakshi

కౌంట్‌డౌన్!

మున్సిపల్  పాలకమండలి ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గురువారం కొత్త పాలకమండళ్లు కొలువు తీరనున్నాయి. తెలుగుదేశం పార్టీ అనైతిక చర్యల కారణంగా యర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు విప్ నోటీసులు అందజేశారు. జమ్మలమడుగు ఛైర్మన్ ఫలితాన్ని లాటరీ నిర్దేశించనుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా జరగనున్నాయి.     
 
 సాక్షి ప్రతినిధి,కడప: జిల్లాలో కడప కార్పొరేషన్, పులివెందుల, రాయచోటి, యర్రగుంట్ల మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. యర్రగుంట్ల మున్సిపాలిటిలో వైఎస్సార్‌సీపీ 18మంది కౌన్సిలర్లను దక్కించుకుంది.
 
 టీడీపీ కేవలం 2స్థానాలకే పరిమితమైంది. అయితే వైఎస్సార్‌సీపీకి చెందిన 8మంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు ప్రలోభపెట్టారు. ఆ మేరకు ఆ 8మంది కౌన్సిలర్లు టీడీపీ క్యాంపునకు తరలివెళ్లారు. దాంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. ఇరుపక్షాలు తమ వైపు 10మంది కౌన్సిలర్లు ఉన్నారనే భ్రమలో ఉన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించరనే ఆశాభావం ఆ పార్టీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. యర్రగుంట్ల, జమ్మలమడుగు మినహా మిగిలిన చోట్ల ఛైర్మన్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఆశాభావాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
 
 భయాందోళనకు గురిచేస్తున్న ‘దేశం’ నేత
 యర్రగుంట్ల మున్సిపల్ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ విప్ నోటీసులు అందజేసింది. ఆ కారణంగా పదవులు కోల్పోతామనే బెంగ కౌన్సిలర్లను వెంటాడుతోంది. దాంతో టీడీపీ క్యాంపులోని వారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే తమ పరువుకు భంగం ఏర్పడుతుందని టీడీపీకి చెందిన ఓ ఎంపీ సొదరుడు వీరంగం చేస్తున్నట్లు సమాచారం. ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ కారణంగా వైఎస్సార్‌సీపీకి ఓటేశారా? తర్వాత ఉంటుంది. ప్రాణాలు దక్కాలంటే తాము ప్రకటించిన అభ్యర్థికే ఓటు వేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మీ 8మందిలో ఒకర్ని ఛెర్మైన్‌గా ప్రతిపాదిస్తాం, వారికే ఓటెయ్యండంటూ వివరించినట్లు తెలుస్తోంది. విప్ ధిక్కరిస్తే పదవి పోతుందికదా? మళ్లీ మేం గెలవగలమా? అంటూ కొందరు కౌన్సిలర్లు ప్రశ్నించడంతో ఆ నాయకుడు తీవ్రస్థాయిలో చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. అటు ఇటుగా వ్యవహరించారో మీ సంగతి తర్వాత చూసుకుంటానంటూ పరుషపదజాలం ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం యర్రగుంట్లకు పాకడంతో కౌన్సిలర్ల బంధువులు తీవ్రంగా మథన పడుతున్నారు.
 
 ఛెర్మైన్‌ను నిర్దేశించనున్న లాటరీ
 జమ్మలమడుగు మున్సిపాలిటిలో 11స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కగా, 9 స్థానాలు మాత్రమే వైఎస్సార్‌సీపీకి దక్కాయి. కాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఇరువురు ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా జమ్మలమడుగు మున్సిపాలిటిలో నమోదు చేయించుకున్నారు. దాంతో ఇరు పక్షాలకు సమానంగా ఓట్లు లభించాయి.
 
 దీంతో లాటరీ పద్ధతిన ఛైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఛెర్మైన్ అభ్యర్థుల పేర్లు ఒకే సైజు పేపర్లలో, ఒకే కలర్ పేపర్లలో ఐదేసి చొప్పున రాసి ఒక డబ్బాలో వేసి కలియ తిప్పనున్నారు. వాటి నుంచి ప్రిసైడింగ్ అధికారి ఒక పేపర్ తీయనున్నారు. అందులో ఏ పేరుంటే ఆపేరు వ్యక్తి ఛెర్మైన్‌గా ఎన్నిక కానున్నారు. వైస్ ఛెర్మైన్ ఎన్నిక కూడా అదే పద్ధతిలో ఉంటుంది. యర్రగుంట్ల మున్సిపాలిటిలో విప్ ధిక్కరించి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఇక్కడ కూడా లాటరీ పద్ధతిలోనే ఛైర్మన్ ఎన్నికను చేపట్టాల్సి ఉంటుంది.
 
 కడపపై టీడీపీ
 దింపుడు కళ్లెం ఆశలు గల్లంతు
 కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ 42 కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ 8స్థానాలను దక్కించుకుంది. అయితే కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన సక్రమంగా నిర్వహించలేదని ఒక మాజీ కార్పొరేటర్ హైకోర్టును ఆశ్రయించారు.
 
 ఆ కేసు కారణంగా పాలకమండలి ఏర్పాటుకు ప్రతిబంధకం కానుందని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా మంగళవారం హైకోర్టులో ఉన్న కేసు మరోవారం రోజులకు వాయిదా పడటంతో టీడీపీ నేతల ఆశలు నీరుగారాయి. డివిజన్ల పునర్విభజనపై నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు తలెత్తని అభ్యంతరాలు ఆ తర్వాత ఉత్పన్నం కావడం వెనుక రాజకీయ కారణాలు దాగి ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement