ఫ్యాన్ హవా
కడప కార్పొరేషన్‌లో తిరుగులేని ఆధిక్యత
మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులు కైవసం
97 స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ
87 స్థానాలతోనే సరిపెట్టుకున్న టీడీపీ
కాంగ్రెస్‌కు ఒకే ఒక్క స్థానం
పుర సమరంలో ఫ్యాన్ గాలి వీచింది. కడప కార్పొరేషన్‌లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అదే హవాను కనబరిచింది. 186 మున్సిపల్ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 97స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 87స్థానాలతోనే తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకుంది. 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తే, 42 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకోగా, 8స్థానాల్లో టీడీపీ నెగ్గింది. జిల్లాలో మరోమారు వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా, టీడీపీ వెనుకబడింది. అయితే పాలకమండలిని కైవసం చేసుకునేందుకు సంఖ్యాపరంగా సరిపడ సీట్లు దక్కించుకోవడంతో నాలుగు మున్సిపాలిటీలు ఆపార్టీ ఖాతలో జమకానున్నాయి.
జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు, కడప కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు స్టేటస్‌కో ఆర్డర్ కారణంగా రాజంపేట మున్సిపల్ ఎన్నికలు రద్దయ్యాయి. మున్సిపాలిటీలను పరిశీలిస్తే పులివెందుల, రాయచోటి, యర్రగుంట్లలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీలలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించగా, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో చావుతప్పి కన్నులొట్ట అయినట్లుగా స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కింది. మొత్తానికి నాలుగు మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ వశం కానున్నాయి. సంఖ్యా పరంగా పాలకమండళ్లను కైవసం చేసుకున్నా, జిల్లాను పరిగణలోకి తీసుకుంటే 236 మందికిగాను, 139మంది వైఎస్సార్‌సీపీ ప్రతినిధులుగా ఎన్నికకాగా, 95 మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా ఒకరు మాత్రమే జిల్లా నుంచి ఎన్నిక కావడం విశేషం. మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
ఓట్లల్లో సైతం ఆధిక్యతే..
మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీకే పట్టణ ఓటర్లు మొగ్గుచూపారు. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు, ఏడు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో 4,54,769 మంది పట్టణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్‌సీపీకి 2,27,480 మంది ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 1,86,178 మంది ఓటేశారు. ఈలెక్కన 41,302 ఓట్లు అధికంగా వైఎస్సార్‌సీపీ దక్కాయి. ఇతర పార్టీల అభ్యర్థులకు 41,111 మంది అనుకూలంగా ఓటు వేశారు.
తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్....
జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని హవా ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశంతో తుడిచిపెట్టుకుపోయింది. 236 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో ఒకే ఒక్క స్థానాన్ని ఆపార్టీ దక్కించుకుంది. బద్వేలులో ఒక కౌన్సిలర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాలలో నామినేషన్లు సైతం వేయలేని దుస్థితి ఆ పార్టీకి ఎదురైంది.
సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినా..
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం పూర్తి కాకపోయినా మున్సిపోల్స్‌లో సత్తా చాటిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే మున్సిపల్, స్థానిక సంస్థలకు ఎన్నికల నేపధ్యంలో వైఎస్సార్‌సీపీకి భారం కానున్నట్లు విశ్లేషకులు ముందే భావించారు. పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా, సంస్థాగ తంగా పూర్తిగా నిలదొక్కకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. మాజీ కౌన్సిలర్ల కారణంగానే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీలలో ఓటమి ఎదురైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఏడు మంది కౌన్సిలర్లను ఎన్నికల బరిలో దింపగా ఐదుగురు ఓటమి చెందారు. ఈ అంశాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. స్థానికంగా వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.