సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. 27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8 డివిజన్లను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డులు, దాచేపల్లి నగర పంచాయతీ, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గత మార్చిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మరణం, అప్పట్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 19 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 10 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమోదించిన 838 నామినేషన్లను అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్నికలు జరుగుతున్న 46 డివిజన్లలోను వైఎస్సార్‌సీపీ బరిలో ఉంది. టీడీపీ 44 డివిజన్లలో పోటీ చేస్తోంది.
నేనే తప్పుకొన్నా.. మా పార్టీవాళ్లే డ్రామా చేస్తున్నారు
దర్శి టీడీపీ నేత శ్రీనివాసరావు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక టీడీపీ నీచరాజకీయాలకు తెరతీసింది. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం స్వచ్ఛందంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం ముందు హైడ్రామా చేశారు.
తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ హడావుడి చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి, తాను స్నేహితులమని, స్నేహితుడిపై పోటీ చేసేందుకు ఇష్టం లేక నామినేషన్ ఉపసంహరించుకున్నానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ పెద్దలు తనను బెదిరించారని, సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని అధికారులకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ‘లాయర్‌తో లోపలికి వెళ్లు.. అంతా వాళ్లే చూసుకుంటారు..’ అని తనను బలవంతం చేశారని చెప్పారు. తాను ఇష్టపూర్వకంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నానని శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు.
27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం
Published Wed, Nov 10 2021 3:26 AM | Last Updated on Wed, Nov 10 2021 8:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment