
పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ వద్ద సాయుధ భద్రత
ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తోంది. మరో రెండు వారాల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పేస్, రైజ్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద స్ట్రాంగ్ రూమ్‌ల సమీపంలోనే లెక్కింపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకురావడం.. లెక్కించిన తర్వాత తిరిగి వాటిని భద్రపరిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెంట్లు అధికారులు, లెక్కింపు సిబ్బంది కూర్చుకొనేందుకు వీలుగా బ్యారికేడ్లును నిర్మిస్తున్నారు.
ఒంగోలు సమీపంలోని రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో దర్శి, యర్రగొండపాలెం, కొండపి, ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల ఈవీఎంలు ఉన్నాయి. మెయిన్, ఎంబీఏ, మొదటి, రెండవ అంతస్తుల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయి. వీటి వద్ద లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి సైన్సెస్ ఇంజినీరింగ్ కళాశాలలో పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల ఈవీఎంలు ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, అబ్దుల్ కలామ్ బ్లాకు, సివిల్ ఇంజినీరింగ్ బ్లాకు, సెంట్రల్ లైబ్రరీలలో స్ట్రాంగ్ రూమ్‌లను ఉంచారు. వీటి వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మాస్టర్ ట్రైనింగ్ పూర్తి..
జిల్లాలో ఉప కలెక్టర్ హోదాలోని అధికారులు పది మంది మాస్టర్ ట్రైనర్లకు ఓట్ల లెక్కింపు విధానంపై విజయవాడలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా నుంచి వెళ్లిన మాస్టర్ ట్రైనర్లు ఈసీ పర్యవేక్షణలో లెక్కింపులో తెలుసుకున్న అంశాలపై బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని మీడియా కేంద్రం వద్ద శిక్షణ ఇచ్చారు. ఆర్వోలు కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్‌నియోజకవర్గాలకు, జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు, సహాయ అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న కార్య పర్యవేక్షకులకు ఈ శిక్షణ ఇచ్చారు. మూడో దశలో గురువారం నుంచి నియోజకవర్గాల వారీగా శిక్షణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ శుక్ర, శనివారాలతో ముగియాలి. ఆ తర్వాత ఎవరికైనా ఓట్ల లెక్కింపులో సందేహాలు ఉంటే సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలి. ఓట్ల లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను శిక్షణలో డీటైల్డ్‌గా వివరించారు. ఈ దఫా ఓట్ల లెక్కింపు ఆషామాషీగా ఉండదని, లెక్కింపు విధులలో ఉన్న సిబ్బంది అధికారులు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓట్ల లెక్కింపులో శిక్షణ పక్కాగా ఉండాలని ఆర్వోలకు సూచించారు. ఎక్కడా తొందర పాటు చర్యలు వద్దని హెచ్చరించారు.
కౌంటింగ్ ఏజెంట్ల సమాచారసేకరణ..
ఓట్ల లెక్కింపునకు 10 నుంచి 15 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఒక్కటి రిటర్నింగ్ అధికారి టేబుల్. ఈ టేబుళ్ల స్కేచ్‌లు వేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ఆయా పార్టీల ప్రతినిధులు కేటాయించిన ఏజెంట్లు వివరాల ప్రకారం వారి సమాచారాన్ని పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. ప్రధాన పార్టీలకు నియోజకవర్గాల వారీగా వచ్చిన వివరాల ప్రకారం వారి నేర చరిత్ర ఇతర అంశాల గురించి వాకబు చేస్తున్నారు. ఏజెంట్ల అనుమతికి ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయనున్నారు.
సిబ్బంది వివరాలు చివరి రోజునే..
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎంపిక చేసిన సిబ్బంది వారు పని చేసే టేబుళ్ల వివరాలు చివరి రోజు వరకు తెలిసే పరిస్ధితి లేదు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు వివిధ హోదాల్లోని సిబ్బంది రెండు వేల మంది వరకు వినియోగించుకుంటున్నారు. వీరి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరించి జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషనర్‌కు పంపారు. 23వ తేదీ ఉదయం 5 గంటలకు ఎవరు ఎక్కడ పని చేయాలో వివరాలు వెల్లడవుతాయి. వారు ఓట్ల లెక్కింపు చేయడానికి గంట ముందుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అలాగే ఒంగోలు నగరంలోనూ నిషిద్ధ ఆంక్షలు అమలులో ఉంటాయి.
నియోజకవర్గానికి ఐదు కేంద్రాల వీవీప్యాట్స్ లెక్కింపు..
వీవీ ప్యాట్ల విషయంలో ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక నియోజకవర్గం పరిధిలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్ల స్లిప్పులను మాత్రమే లెక్కించేందుకు అనుమతిస్తారు. మాక్ పోలింగ్ సందర్భంగా వీవీ ప్యాట్లలో ఆ ఓట్లు కలిస్తే ఏజెంట్లు, అభ్యర్ధుల సమక్షంలో వీటిని లెక్కిస్తారు. పోలింగ్ సందర్భంగా ఉన్న వివరాలను ఈ సందర్భంగా సరిపోల్చుకొని ఇరువురి సమక్షంలో ఈ తరహా ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ సమస్యలేమైనా తలెత్తితే అలాంటి వాటిని చివరిగా లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. సమస్య ఉండి అవసరమనుకొని బావిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు.
మొత్తం ప్రక్రియ వీడియో చిత్రీకరణ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. లెక్కింపు రోజు ఉదయం 7.59 గంటల వరకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారులు తీసుకొనే విధంగా వెసులుబాటు ఉంది. పోస్టల్ బ్యాలెట్‌లతో పాటు వీవీ ప్యాట్లు స్పిప్పుల లెక్కింపు, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అన్ని వివరాలను వీడియో చిత్రీకరిస్తారు. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిం చేందుకు, పౌరులకు వివరాలను తెలియజెప్పడానికి తగిన ఏర్పాట్లు చేశారు.