
రూ.కోట్లు కొట్టారు
మన్యంలో మళ్లీ రంగురాళ్ల అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున ఆరంభమయ్యాయి. కోట్ల రూపాయల సరకు తరలిపోయింది.
- మన్యంలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
- సంక్రాంతి పూట గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ
- పోలీసుల సహకారంతో పేట్రేగిపోయిన వ్యాపారులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మన్యంలో మళ్లీ రంగురాళ్ల అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున ఆరంభమయ్యాయి. కోట్ల రూపాయల సరకు తరలిపోయింది. పోలీసుల సంపూర్ణ సహకారాలతో సంక్రాంతి సమయంలో స్మగ్లర్లు కొత్త క్వారీలను తెరచి నిపుణులైన కార్మికులతో తవ్వకాలు జరిపించారని తెలిసింది. జిల్లా ఎస్‌పీ దుగ్గల్ గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించిన సమయంలోనే ఆయన కళ్లుగప్పి చింతపల్లి పోలీసులు రంగురాళ్ల తవ్వకాలకు అనుమతులిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకోసం రంగురాళ్ల అక్రమ వ్యాపారులు కిందిస్థాయి పోలీసు అధికారులకు రూ.లక్షల్లో మామూళ్లను ముట్టజెప్పారని తెలిసింది. ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో ఉండగా చింతపల్లి, గూడెం మండలాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరిగాయి. చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వ్యాపారులు పేరుమోసిన స్మగ్లర్ చింతపాకల గోవిందు ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపించి సరకు తరలించారన్న ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లాయి. పోలీసుల సహకారంతో రక్షిత అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తవ్వకాలపై అటవీశాఖాధికారులు ఆలస్యంగా దృష్టిసారించారు.
గతంలో అప్పటి నర్సీపట్నం ఏఎస్‌పీ ఉక్కుపాదం మోపడంతో తవ్వకాలు పూర్తిగా ఆగిపోయాయి. అప్పట్లో తవ్వకందారులు, వ్యాపారులపై గట్టి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఏఎస్‌పీతో పాటు ఎస్పీ కూడా మారిపోవడం, కింది స్థాయి అధికారులు కూడా బదిలీ కావడంతో అక్రమ వ్యాపారులు తిరిగి విజృంభిస్తున్నారు. చింతపల్లితో పాటు పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద గతంలో తెరచిన క్వారీలో తిరిగి తవ్వకాలు జరిపేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల మద్దతు కూడా అక్రమ తవ్వకందార్లుకు ఉండడంతో అటవీశాఖాధికారుల కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.