వజ్రకరూరు: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం పిడుగుపడి దంపతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన కదిరప్ప(65), లక్ష్మీదేవి(55) పూరిగుడిసెలో నిద్రిస్తుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆ దంపతులు నిద్రలోనే కన్నుమూశారు. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటుకు ఆ దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.