కారు ప్రమాదంలో దంపతులు మృతి
Published Wed, Aug 14 2013 6:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు.నూతన వధూవరులతోపాటు కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు బోడా అంబేద్కర్ (48), ఎలిజిబెత్‌రాణిది (45) పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం సూరపనేనిగూడెం గ్రామం. వివరాలు ఇవి.. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఏఎస్సైగా పనిచేస్తున్న తిరుపతి నాగేంద్రరావు కుమార్తె శ్రీదేవికి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బోడా దుర్గాప్రసాద్‌కుఈ నెల 9న మచిలీపట్నంలో వివాహమైంది.
హైదరాబాద్‌లో సోమవారం వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ నిర్వహించారు. అదేరోజు రాత్రి వధువు ఇంటికి మచిలీపట్నం కారులో బయలుదేరారు. గుంటుపల్లి వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ముందు సీట్లో కూర్చున్న వరుడి చిన్నాన్న అంబేద్కర్ చెట్టుకు, కారుకు మధ్య నలిగి మరణించాడు. వెనుక సీటులో కూర్చున్న అంబేద్కర్ భార్య ఎలిజిబెత్‌రాణి, నూతన వధూవరులు దుర్గాప్రసాద్, శ్రీదేవి, కారు డ్రైవర్ నున్న రాజీవ్ (23)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఎలిజబెత్‌రాణి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కోమాలో నూతన వధూవరులు
నూతన వధూవరులు కోమాలోకి వెళ్లిపోవడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి సంబరంలో పాల్గొనడానికి వచ్చిన దంపతులు మృతిచెందడంతో ఏఎస్సై నాగేంద్రరావు కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Advertisement
Advertisement