పెద్దదోర్నాల, న్యూస్‌లైన్: నిండు నూరేళ్లూ కలిసి జీవించాల్సిన ఆ దంపతులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. అప్పటి వరకూ సొంతూరు వెళ్తున్నామన్న ఆనందం వారిలో క్షణాల్లో ఆవిరైంది. ఆ జంట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని తుమ్మల బైలు సమీపంలో తెట్టగుండం గేటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పెద్దదోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన కంభం పాలంకయ్య (44) శ్రీశైలం ప్రాజెక్టు ఏపీజెన్‌కోలో ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తున్నారు.
తన భార్య లింగమ్మ(38)తో కలిసి బైకుపై శ్రీశైలం నుంచి స్వగ్రామం బయల్దేరారు. తెట్టగుండం గేటువద్ద వెనుకగా వచ్చిన లారీ వేగాన్ని నియంత్రించుకోలేక వీరు ప్రయాణిస్తున్న బైకును వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు గుర్తించారు. స్థానిక ఎస్సై బీవీవీ సుబ్బారావు వచ్చి ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు ఉద్యోగులు, చిన్నదోర్నాలలో ఉన్న పాలంకయ్య బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సొంతింటి కల నెరవేరకుండానే..
పాలంకయ్య దంపతులు ఇటీవల స్వగ్రామం చిన్నదోర్నాలలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా వారసత్వంగా వచ్చిన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన పాలంకయ్య దంపతులు.. కొంతకాలం నుంచి విధుల అనంతరం తరచూ చిన్నదోర్నాలకు వచ్చి వెళ్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని చూసుకునేందుకు వస్తున్న పాలంకయ్య దంపతులను మృత్యువు లారీ రూపంలో కబళించింది.
మిన్నంటిన రోదనలు
పాలంకయ్య దంపతుల మృతదేహాలను చూసి బంధువులు, సహోద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు అందిరితో స్నేహభావంతో ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు. మృతుల కుమారుడు మల్లికార్జున, కుమార్తె మల్లేశ్వరితో పాటు లింగమ్మ తల్లిదండ్రులు చిన్నగురవయ్య, కాశమ్మలు సంఘటన స్థలంలో రోదించినతీరు అక్కడి వారిని కలచి వేసింది.
స్వగ్రామంపై మమకారంతో..
పాలంకయ్య, లింగమ్మలిద్దరి స్వగ్రా మం చిన్నదోర్నాల. స్వయానా తన సోదరి కాశమ్మ కుమార్తె లింగమ్మను 16 ఏళ్ల క్రితం పాలంకయ్య వివాహం చేసుకున్నారు. స్వగ్రామంపై మమకారంతో వారు తరచూ వచ్చే వారని స్థానికులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామంలో జీవించాలని దంపతులు భావించారు. ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు అన్యోన్యంగా జీవిం చే ఆ జంట ద్విచక్ర వాహనంపై వస్తుం డగా అనుకోని సంఘటన జరిగింది.
మృత్యువులోనూ వీడని బంధం
Published Sat, Jan 25 2014 8:20 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement