చెన్నై నుంచి వచ్చి విజయవాడలో తన ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సనకా బసవపున్నయ్య
కోవిడ్–19 మహమ్మారి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని ఇంటి దారి పట్టిస్తోంది. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వందలాది మందిని వైరస్ భయం వెంటాడుతుండటంతో సంబంధిత యాజమాన్యాలు సెలవులు మంజూరు చేస్తున్నాయి. పైగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వస్థలాలకు వస్తున్నారు. అక్కడ కంటే ఇక్కడే ‘సేఫ్’ అన్న భావనతో సత్వరమే సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా వైరస్(కోవిడ్–19) అలజడి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహించుకునే అవకాశాన్ని సంబంధిత ఐటీ సంస్థలు ఇచ్చాయి. ఈ వెసులుబాటుతో జిల్లాకు వచ్చిన ఐటీ ఉద్యోగులు ఇప్పటికే తమ ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పూనే, అహ్మదాబాద్ తదితర నగరాల్లో పనిచేస్తున్న వారికి ఐటీ సంస్థలు ప్రస్తుతానికి పది రోజుల పాటు ఈ సదుపాయాన్ని కల్పించాయి. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై వివిధ నగరాల్లో అప్రెంటీస్ చేస్తున్న ఐటీ విద్యార్థులను కూడా ఆయా కంపెనీలు నిరవధిక సెలవులు ప్రకటించి ఇళ్లకు పంపేస్తున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని ఎన్‌ఐటీ, ఐఐటీ యాజమాన్యాలూ కొద్దిరోజుల పాటు తమ విద్యార్థులకు సెలవులిచ్చాయి.
విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్ చేస్తున్న సిబ్బంది
ఇలాంటి వారందరూ రెండు మూడు రోజుల నుంచి తమ స్వస్థలాలకు బస్సులు, రైళ్లలోను, మరికొందరు విమానాల్లోనూ బయలుదేరి వస్తున్నారు. వీరేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్థానికంగా ఉంటున్న కుటుంబ సభ్యులు తమవారు సత్వరమే స్వస్థలాలకు రావడమే మంచిదన్న భావనతో ఉన్నారు. ఇలా కరోనా వెలుగు చూసిన తర్వాత కృష్ణా జిల్లాకు మంగళవారం వరకు 700 మందికి పైగా ఇతర దేశాల్లో ఉంటున్న వారొచ్చారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి. శ్రీరామచంద్రమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన, వస్తున్న వారంతా కరోనా తీవ్రత తగ్గే వరకు ఇక్కడే ఉండి అనంతరం తిరిగి బయలుదేరి వెళ్లాలని యోచిస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ ఆరా..
ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారి గురించి ఆరా తీస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని వారి ఇళ్లకే పరిమితం చేసి 14 రోజులు పరిశీలనలో ఉంచుతున్నారు. కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాక వారు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం అరైవల్ బ్లాక్‌లో ఇప్పటికే ఒక స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విమాన ప్రయాణికులను సమగ్రంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి తాజాగా అక్కడ మరో స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment