
సాక్షి, అమరావతి: ప్రపంచ దేశాలను కోవిడ్–19 వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను పూర్తిగా నిఘా పరిధిలోకి తెచ్చారు. ఏపీలోని ఎయిర్ పోర్టులు, పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనప్పటికీ.. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. కోవిడ్ అనుమానిత లక్షణాలు లేకపోతేనే బయటకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వైద్య, ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. విశాఖ ఎయిర్ పోర్టుతో పాటు గంగవరం, విశాఖ, కృష్ణపట్నం పోర్టులలో థర్మల్ స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించినా వారిని తక్షణమే సంబంధిత ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సింగపూర్, కౌలాలంపూర్, దుబాయ్ నుంచే వచ్చారు..
మార్చి 3వ తేదీ వరకు మన రాష్ట్రానికి ఎక్కువ మంది సింగపూర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ఆ తరువాత స్థానంలో కౌలాలంపూర్, దుబాయ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యధికంగా 2,638 మంది 24 విమానాల్లో వచ్చారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 20 విమానాల ద్వారా 1,905 మంది వచ్చారు. దుబాయ్ నుంచి ఎక్కువ విమానాలు అంటే 34 వచ్చినా ప్రయాణికులు 1,869 మంది మాత్రమే విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. మొత్తం 11 చార్టెర్డ్ ఫ్లైట్ల ద్వారా 58 మంది వచ్చారు. మార్చి 3వ తేదీ వరకూ మొత్తం 89 విమానాల ద్వారా 6,470 మంది విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చారు. చైనా, సింగపూర్, సౌత్ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మొత్తం 28 షిప్పుల్లో 678 మంది విశాఖ పోర్టుకు వచ్చారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టు ద్వారా కూడా ప్రయాణికులు ఏపీకి వచ్చారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య 1,125 మంది అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ముఖాలకు మాస్కులు తగిలించుకుని ఉన్న రోగులు
ఐదు జిల్లాల్లో 10 అనుమానిత కేసులు
మన రాష్ట్రంలోనూ కోవిడ్–19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడులో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఒకరు, విశాఖ ఎయిర్ పోర్టులో ముగ్గురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో వారిని ముందు జాగ్రత్త చర్యగా ఐసొలేషన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి రక్తం, గొంతు నుంచి కళ్లె శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు.
– సాక్షి, అమరావతి బ్యూరో/ఏలూరు టౌన్/ శ్రీకాకుళం/రాజమహేంద్రవరం/విశాఖపట్నం
‘పశ్చిమ’లో ఇద్దరు ..
పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. అనుమానితుల్లో ఒకరు మస్కట్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తూ గతనెల 18న బి.కొండేపాడులోని తన మావయ్య ఇంటికి వచ్చాక జ్వరం, జలుబు బారిన పడ్డాడు. అతడి మావయ్యకు కూడా జ్వరం, దగ్గు రావడంతో కుటుంబ సభ్యులు కోవిడ్ అనుమానంతో ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారిని ఐసొలేషన్ వార్డులో చేర్చి రక్ల, కళ్లె నమూనాలను సేకరించి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు.
సోంపేటలో ముగ్గురు
శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ముగ్గురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా.. బుధవారం ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారిని రిమ్స్‌కు తరలించారు. వారం రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చిన ముగ్గురూ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పూణె పంపించారు.
విశాఖలో ముగ్గురు
కోవిడ్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో విశాఖ ఎయిర్ పోర్టులో ముగ్గురిని అక్కడి వైద్యులు కోవిడ్ వార్డుకు పంపించారు. ఈ ముగ్గురు గత నెలలో మలేసియా వెళ్లి మంగళవారం విశాఖ తిరిగొచ్చారు. జ్వరం, తీవ్ర జలుబు, గొంతునొప్పి ఉండటంతో వైద్యులు బుధవారం చెస్ట్ ఆసుపత్రిలో గల ఐసొలేటెడ్ వార్డులో చేర్చి నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు.
విజయవాడలో ఒకరు
కృష్ణా జిల్లా విజయవాడలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయేమోననే అనుమానంతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆ వ్యక్తి విధుల్లో భాగంగా ఇటీవల జర్మనీకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల ఇంటికి వచ్చిన అతడు జలుబు, జ్వరంతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు రక్త నమూనా, గొంతులోని కళ్లెను సేకరించి పూణె ల్యాబ్‌కు పంపించారు.
విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ముందుజాగ్రత్తగా ఏర్పాటు చేసిన ఒక రూమ్
‘తూర్పు’లో ఒకరు
కోవిడ్ వైరస్ సోకిందనే అనుమానంతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బుధవారం కాకినాడ సామాన్య ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువకుడు ఈ ఏడాది జనవరి 21న దక్షిణ కొరియా వెళ్లాడు. నెల రోజులపాటు అక్కడే ఉండి గత నెల 22న హైదరాబాద్ చేరుకున్నాడు. గత నెల 28న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అత్త వారిల్లు గోదశివారిపాలెం చేరుకున్నాడు. జలుబు, దగ్గు బారినపడటంతో వైద్యాధికారులు అతడిని కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించి ఐసొలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రక్త, కళ్లె నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు ప్రైవేట్ బస్సులో అతడితోపాటు ప్రయాణించిన 40 మంది ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment