
సాక్షి, అమరావతి: ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెన ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ, తెలుగుదేశం పార్టీల వైఖరిని ఎండగడుతూ చేపట్టిన ఉద్యమం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ నాయకుడు కె.రామాంజనేయులు అధ్యక్షతన మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఈడ్పుగంటి నాగేశ్వరరావు, కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణను చర్చించిన అనంతరం ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈనెల 22న చేపట్టే జాతీయ రహదారుల దిగ్బంధానికి అన్ని వర్గాలు సహకరించాలన్నారు.
హోదా ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..