రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారు
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
గుత్తి : ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా తాను నిప్పునని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి నిప్పు కాదు తుప్పు అని రుజువైందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఎద్దేవా చేశారు. పట్టణంలో ఉన్న సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు, మండల కార్యదర్శి శ్రీరాములుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొరికిన విషయం ప్రపంచానికి తెలుసునన్నారు.
రేవంత్‌రెడ్డి ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా కూడా నిజం ఒప్పుకోకుండా ఇంకా బుకాయించాలని చూడటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుని రేవంత్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాబు జీవితమంతా అవినీతిమయమన్నారు. బాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాబు జమానా అవినీతి ఖజానా అని వామపక్షాలు బుక్‌లెట్‌లను రాష్ట్ర మంతా పంచారన్నారు.
తెహల్కా డాట్ కామ్ పత్రిక కూడా ప్రపంచంలోనే నంబర్‌వన్ అవినీతిపరుడు బాబు అని రాసిందన్నారు. ఇలాంటి వ్యక్తి తను నిప్పునని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా నిజాయితీ పరుడైతే విచారణను ఎదుర్కోవాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌లో నైతిక బాధ్యత వహించి బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
విత్తన పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు :
ఈ యేడాది సకాలంలో వర్షాలు రావడంతో రైతులందరూ సంతోషించారని రాంభూపాల్ చెప్పారు. అయితే విత్తన పంపిణీ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించడంతో రైతులు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కాల్సి వస్తోందన్నారు. ఈ నెల 7వ తేదీ విత్తన కాయలను పంపిణీ చేస్తామని చెప్పి తర్వాత 10వ తేదీ అని అటు తర్వాత 14వ తేదీ అని చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు రుణ మాఫీ అని రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పార ని చెప్పారు.
ఇపుడు వేరుశనగ విత్తన కాయలు, ఎరువుల కోసం రైతులను తిప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతులను అలసిపోయేటట్లు చేసి వారిని వ్యవసాయానికి దూరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోందన్నారు. రైతులకు ఈ నెల 14న విత్తన కాయలు పంపిణీ చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్‌ఎం బాషా, రేణుక, సునీత, రామచంద్ర స్వామి, రామచంద్ర, మల్లికార్జున, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నిప్పు కాదు తుప్పు
Published Sat, Jun 13 2015 2:28 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement