అడ్డంగా దొరికినా... బాబుకి బుద్ధిరాదు
ఇప్పటికీ తప్పుడు రాజకీయాలు పాల్పడుతున్నారు
అనంతపురం అర్బన్: ఓటుకు నోటు వ్యవహారంలో స్పష్టంగా దొరికినా చంద్రబాబునాయుడికి బుద్ది రావడం లేదు. ఏపీలో బలంలేని చోట కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు డబ్బులు ఖర్చు చేయాలని చూస్తున్నారు. ఈయన మారడం అనేది జరగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. రాయలసీమ జిల్లాల సీపీఐ సమితి సమావేశంలో పాల్గొన్నేందుకు మంగళవారం అనంతపురం విచ్చేసిన ఆయన ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నా ఫోన్ ట్యాప్ చేశారు.. సెక్షన్-8 అమలు చేయాలని అంటున్నారే తప్ప అది నా గొంతు కాదని మాత్రం చంద్రబాబు చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో స్పష్టంగా దొరికిపోయారు.. అయినా బుద్దిరాలేదు. కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. మరి ఇక్కడ ఆయన చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌పీవెరైడ్డి, కొండపలిగీత, తొమ్మిది మంది ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకున్నారు.
ఒంగోలు జడ్పీ చైర్మన్‌ని చేర్చుకున్నారు. కర్నూలు స్థానిక సంస్థలలో బలం లేదు. అయినా అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పామోహన్‌రెడ్డిని నిలబెట్టారు. చంద్రబాబుకి బుద్ది రాదు. ఆయన మారడు. తెలంగాణలో చేసిన అవే తప్పులు చేస్తున్నాడు. అదే ఫిరాయింపులకు పాల్పడుతున్నాడు. డబ్బులతో ఆ పార్టీ ఎమ్మెల్యే దొరికినా కర్నూలులో డబ్బు పెట్టి గెలవాలనుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఫిరాయింపులు కప్పిపుచుకుంటే ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఓటు నోటు వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి. దోషులకు కఠిన శిక్ష విధించాలి. చంద్రబాబు వాయిస్ ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.