పార్లమెంట్‌లో ‘ఓటుకు కోట్లు’
* ఆరు వారాలైనా అలికిడి లేదేంటి?
* చంద్రబాబు సంభాషణల టేపులు బయటపడినా చర్యలేవి?
* సీబీఐకి అప్పగించాలని పార్లమెంట్‌లో పట్టుబట్టనున్న కాంగ్రెస్
* రాహుల్‌తో సమావేశమైన తెలంగాణ, ఏపీ పీసీసీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాల్పడిన ‘ఓటుకు కోట్లు’ ప్రలోభాల వ్యవహారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ కేసు వ్యవహారంపై పార్లమెంట్‌లో లేవనెత్తి సీబీఐ విచారణకు పట్టుబట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారితో వేర్వేరుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 27 మంది మృతికి దారితీసిన సంఘటనపైనా చర్చించారు. ఈ రెండు ఘటనలపై సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను ఆదేశించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన వ్యవహారంపై రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడటం, ఈ వ్యవహారంలో సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్టు టెలిఫోన్ సంభాషణ టేపులు బయటకు పొక్కిన వైనంపైనా హైకమాండ్ ఆరా తీసింది.
నామినేటెడ్ ఎమ్మెల్యేతో నేరుగా సంభాషించినట్టు ఆడియో టేపులు బయటపడిన తర్వాత కూడా ఆ కోణంలో విచారణ జరక్కపోవడానికి కారణలేంటి అని అడిగినప్పుడు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదై ఆరు వారాలు గడుస్తున్నప్పటికీ సూత్రధారిపై చర్యలు తీసుకోవడంగానీ కేసు పురోగతి ఎటువైపునకు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పీసీసీ నేతలు వివరించారు. ఈ కేసు తెరమీదకు వచ్చిన తర్వాత చంద్రబాబు లేవనెత్తుతున్న అంశాలను పీసీసీ నేతలు వివరించినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని సులభంగా వ దిలిపెట్టరాదనీ, దీనికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాలనీ, ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంట్‌లో లేవనెత్తి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల పీసీసీ నేతలు సమగ్రమైన వివరాలు, కేసు పురోగతిపై నివేదికను అందించాలని ఆదేశించినట్టు తెలిసింది.
ఇదే విషయాన్ని ఏపీ పీసీసీ నేతలు కలిసినప్పుడు రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ బుధవారం ఇక్కడ ఏఐసీసీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారు రాహుల్‌ను కలిసి రాష్ట్ర రాజకీయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై వివరించారు. తర్వాత ఏపీపీసీసీ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్యలు రాహుల్‌గాంధీతో విడిగా సమావేశమయ్యారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని వివరించారు.
పార్లమెంట్‌లో లేవనెత్తనున్న రాహుల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ లేవనెత్తనున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఓటుకు కోట్లు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ ఉల్లంఘన అంశాలను లేవనెత్తుతారని రాహుల్‌తో సమావేశం అనంతరం ఆయన చెప్పారు.