'ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ చేపట్టాలి'
కరీంనగర్(రాయికల్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని శాసనసభ ఉప ప్రతిపక్షనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్‌యూదవ్ ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని గమనించకుండానే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం విడ్డూరమన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెంచడం కోసం పంచాయితీలో పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ గంట గంటకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి 15 రోజులు గడిచినా.. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర సీఎం చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాలయూపన చేస్తే రెండు రాష్ట్రాల ప్రజల్లో విద్వేషాలకు దారితీసే అవకాశముందన్నారు.