సండ్ర అరెస్ట్ | ACB arrested Sandra venkata veeraiah in note for vote case | Sakshi
Sakshi News home page

సండ్ర అరెస్ట్

Published Tue, Jul 7 2015 2:16 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

సండ్ర అరెస్ట్ - Sakshi

సండ్ర అరెస్ట్

* రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు
*  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
*  7 గంటల విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటన
* ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సండ్ర
* ఓ ఎమ్మెల్యేకు నగదు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఏసీబీ
* వేం నరేందర్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధం
* రెండు రోజుల్లో కొందరు ‘ముఖ్యుల’ను ప్రశ్నించే అవకాశం
* అజ్ఞాతంలోకి జిమ్మి బాబు.. అరెస్టుకు నిర్ణయం!

 
సాక్షి, హైదరాబాద్: రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు మొదలయ్యాయి. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అంతకుముందు దాదాపు ఏడు గంటల పాటు దఫదఫాలుగా ప్రశ్నించినా... సండ్ర నోరు విప్పకపోవడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించిన అధికారులు.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని పూర్తిస్థాయిలో విచారించాలని నిర్ణయించారు. విచారణలో ఆయన సహకరించకపోతే.. అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తదనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యులకు నోటీసులు జారీచేసి, విచారించనున్నట్లు సమాచారం.
 
 శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎనిమిది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ వల వేసింది. ఎమ్మెల్యేల ఆర్థిక అవసరాలను బట్టి కోట్ల రూపాయల్లో లంచం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు చేశారు. అనంతరం స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటే డబ్బు బ్యాగ్ తీసుకుని వచ్చిన ఆయన సహచరుడు ఉదయ సింహ, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు సెబాస్టియన్‌లను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు... టీడీపీకి చెందిన అనేక మంది ప్రముఖులకు ఈ ‘ఓటుకు కోట్లు’ బాగోతంలో ప్రయేయం ఉందని గుర్తించారు. రేవంత్ తెచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతా నుంచి విత్‌డ్రా చేశారన్న వివరాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. అయితే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50లక్షలు పోగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది.. వంటి వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించి సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు.. సోమవారం 7 గంటల పాటు సండ్రను ప్రశ్నించారు.
 
 కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడంతో.. అరెస్టు చేశారు. ఇక సోమవారంలోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసును తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఏసీబీ.. జిమ్మి పరారీలో భావిస్తూ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకోవాలని నిర్ణయించింది.
 
 సండ్రదే కీలకపాత్ర: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.150 కోట్లు సమకూర్చుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను గుర్తించే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అప్పగించారు.
 
 అందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను సండ్ర వెంకటవీరయ్యకు అప్పగించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సండ్ర... మే చివరి వారంలో ఆ ఎమ్మెల్యేలతో చర్చించారు. పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు. కోట్ల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన (తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు) ఇద్దరు ఎమ్మెల్యేలతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ముట్టజెప్పారని.. రేవంత్ దొరికిపోగానే ఆ ఎమ్మెల్యే తనకిచ్చిన డబ్బును వెనక్కి తిప్పిపంపారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన ఓ గిరిజన ఎమ్మెల్యేతోనూ సండ్ర సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. సోమవారం నాటి విచారణలో సండ్ర ఏదీ బయటపెట్టనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టును కోరనుంది.
 
 
నరేందర్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఏసీబీ
 టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోమారు ప్రశ్నించనుంది. ఆయనకు నోటీసు జారీ చేయాలా, లేదా ఇంటికి వెళ్లి విచారించాలా అన్నదానిపై మంగళవారంనిర్ణయం తీసుకోనున్నారు. విచారణలో ఆయన సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశముందని ఓ అధికారి వెల్లడించారు. గతంలో నరేందర్‌రెడ్డిని విచారించినా.. ఆయన సహకరించలేదని, డబ్బు ఎవరు సమకూర్చారన్నది తేలాల్సి ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. మండలి ఎన్నికలకు ముందు కొన్ని బ్యాంకు శాఖల నుంచి కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారని, అవి ఎక్కడకు వెళ్లాయన్నది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. వేం నరేందర్‌రెడ్డికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనను విచారించి నిజానిజాలను సరిపోల్చుకుంటామని తెలిపారు.
 
 మరింత కీలకం: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. అతి ముఖ్యమైన ఒక నేతతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులకు, ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement