కర్నూలు(న్యూసిటీ), న్యూస్‌లైన్ :
పెరిగిపోతున్న ధరలు, వాటికి ఊతం ఇచ్చేలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం పోరు మొదలెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయలు, ఉల్లిగడ్డల దండలను మెడలో వేసుకుని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. మహిళలు డప్పులు కొడుతూ పాటల రూపంలో నిరశన తెలిపారు.
పాణ్యం జోన్ అధ్యక్షుడు జి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్ మాట్లాడుతూ పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు కుదేలై పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, డాలర్‌తో మారకం విలువ తగ్గుతుండడం, క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి కారణంగా జనం భారంగా బతుకీడుస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో 35 రోజులుగా జ నం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ మాట్లాడారు. నగర అధ్యక్షుడు డి.గౌస్ దేశాయ్, జిల్లా నాయకులు రామాంజనేయులు, రమేష్‌కుమార్, జేఎన్.శేషయ్య, నాగేశ్వరరావు, కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.
ధరల పెరుగుదలపై సీపీఎం పోరు
Published Sat, Sep 7 2013 2:32 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement