
'కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాలపై చర్యలేవి?'
విజయవాడ : కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాలను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు శుక్రవారం పరిశీలించారు. అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాలను పరిశీలించాన్నారు. అక్రమాలకు పాల్పడినవారు ఎంతటి వారైనా శిక్షించాల్సిందేనని రాఘవులు వ్యాఖ్యానించారు.
రైతులకు ఓ న్యాయం, బడా బాబులకు మరో న్యాయమా అని రాఘవులు ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలకు అనుమతులివ్వమని చెబుతున్న ఏపీసర్కార్ ..బిజెపి కార్యాలయానికి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. కృష్ణా తీరంలో అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని ఆయన తెలిపారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని రాఘవులు హెచ్చరించారు.