సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన స్టార్టప్ ఏరియా వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లుగా తయారైంది. స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తాజాగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాల విలువైన భూములను అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ భూముల్లో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వంటి మౌలిక వసతుల ఏర్పాటుకయ్యే పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఇందుకు రూ.5,500 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టి అన్ని సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే గుండుసున్నా అని చెప్పక తప్పదు. స్టార్టప్ ఏరియా పేరిట ఇచ్చిన భూములను సింగపూర్ కంపెనీలు ప్లాట్లుగా మార్చి ఎంచక్కా విక్రయించుకుంటాయి. అందులో షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు నిర్మించి, వ్యాపారాలు కూడా చేసుకుంటాయి.
విదేశీ కంపెనీలపై ఎంత ప్రేమో..
స్టార్టప్ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు. విలువైన భూములను సింగపూర్ కంపెనీలకు ఇచ్చే బదులు ప్రభుత్వమే స్వయంగా అక్కడ ప్లాట్లు వేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుంది కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి నోటి వెంట సమాధానం రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరుస్తూ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది సులభంగా అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండ
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విషయంలో చేసుకున్న రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు పూర్తిగా సింగపూర్ కంపెనీలకే అనుకూలంగా ఉండడంతో అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం తీవ్రంగా వ్యతిరేకించారు. సింగపూర్ కంపెనీలు పెట్టే పెట్టుబడిలో ప్రభుత్వ రాయితీలు 20 శాతానికి మించి ఇవ్వరాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా సింగపూర్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతాయని, ఆ ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని అజేయ కల్లాం తేల్చిచెప్పారు.
అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సింగపూర్–అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల బదులు ఈ సంస్థే రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు చేసుకుంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఒప్పందం చేసుకునే సంస్థ మారిపోవడాన్ని ప్రస్తుత ఆర్థిక శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర తప్పుపట్టారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ఆర్థిక భారం పడదని సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.
ఒప్పందాలన్నీ తప్పుల తడకలే
స్టార్టప్ ఏరియాలో తొలి దశలో మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇటీవల సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ విస్తుపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడదని గతంలో పేర్కొని, ఇప్పుడు మౌలిక వసతుల కల్పనకు రూ.350 కోట్లు ఎలా అడుగుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పంపాలని ఆదేశించింది.
అయితే, ఈ వివరాలను ఆర్థిక శాఖకు పంపించకుండా సీఆర్‌డీఏ తాత్సారం చేస్తోంది. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ తప్పుల తడకలేనని, అందువల్లే సీఆర్‌డీఏ వెనుకాడుతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒప్పందాలను లోతుగా అధ్యయనం చేసిన తరువాతే మౌలిక వసతులకు నిధులు ఇచ్చేది లేనిది తేల్చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment