రాజధాని కోసం రూ.37,112 కోట్ల అప్పు | Rs .37,112 crore debt for ap capital | Sakshi
Sakshi News home page

రాజధాని కోసం రూ.37,112 కోట్ల అప్పు

Published Fri, Feb 1 2019 1:28 AM | Last Updated on Fri, Feb 1 2019 10:41 AM

Rs .37,112 crore debt for ap capital - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూ. 55,343 కోట్లతో రూపొందించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధానిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.51,867 కోట్లు వ్యయం అవుతుందని.. ఇందులో రూ. 37,112 కోట్లను అప్పుగా తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న సీఆర్‌డీఏ ప్రతిపాదనకు అంగీకరించింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులను తనఖా పెట్టడం ద్వారానూ.. పబ్లిక్‌ బాండ్స్‌ ద్వారానూ రూ. 500 కోట్లను సేకరించడానికి సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది. పబ్లిక్‌ బాండ్స్‌ ద్వారా సేకరించే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం అంగీకరించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రివర్గం సమావేశ మైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత అభివృద్ధి పథకానికి 715 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విదేశీ రుణం(ఈఏపీ) తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. రాజధానిలో సచివాలయం, శాఖాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన రూ.4,900 కోట్ల నిధుల సమీకరణకు సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది.  

కేసుల ఎత్తివేత.. ఖైదీలకు క్షమాబిక్ష..
సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులపై పెట్టిన కేసులనూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించడానికి ఆమోదం తెలిపింది. 

మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలు
►వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, 40 నుంచి 79 శాతం అంగ వైకల్యం గల వారికి ఇస్తున్న రూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచాలని నిర్ణయించింది. 80 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌ రూ.1,500 నుంచి రూ.3,000లకు పెంపు. కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి పెన్షన్‌ రూ. 2500 నుంచి రూ. 3500లకు పెంపు. 
► ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద అదనంగా మరో 3.55 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వులపై ఆమోదముద్ర. 
► పసుపు కుంకుమ–2 పథకం కింద అదనంగా రూ. పది వేలు మంజూరుకు ఆమోదం. 
►  నాయీ బ్రాహ్మణుల హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌. 
►  చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు బ్యాంకు రుణాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంచినీటి సరఫరా సంస్థకు రూ. 1,765 కోట్లు మంజూరు.
►తొమ్మిది జిల్లాలలో తారు (బిటి) రోడ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతు పనులకు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల ద్వారా  రూ.1500 కోట్లు పొందడానికి అనుమతి.  
► పెట్రోల్, డీజిల్‌ ధరల ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి 2 శాతం పన్ను తగ్గిస్తూ లోగడ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యాట్‌ చట్టంలో సవరణల్ని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు ముసాయిదాకు ఆమోదం.
► ‘భూధార్‌’ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు ఆమోదం. 
► రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకానికి ఆమోదం. 
►కర్నూలు జిల్లా బనవాసిలో ఉన్న  మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రంలో టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మంజూరుకు ఆమోదం.
► విశాఖలో ఐటీ పార్కు అభివృద్ధికి భీమునిపట్నం కాపులుప్పాడలో 76.88 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
►  కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో ఎకరా రూ.2.5 లక్షల చొప్పున 2,467.28 ఎకరాల భూమి గ్రీన్‌కో ఎనర్జీస్‌ సంస్థకు కేటాయింపు.
► కర్నూలు జిల్లా పెట్నికోటలో ఎకరా రూ.3,60,000 విలువకు 6.72 ఎకరాల భూమి ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీకి కేటాయింపు.
►సహకార చక్కెర కర్మాగారాలకు షరతులు లేకుండా రూ.200 కోట్ల రుణ సేకరణకు ఆమోదం.
►  విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికేవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement