హైటెక్ బెట్టింగ్ | cricet betting gang | Sakshi
Sakshi News home page

హైటెక్ బెట్టింగ్

Published Mon, Feb 23 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

cricet betting gang

క్రికెట్ పై జోరుగా పందేలు     
అడ్డంగా దోచేస్తున్న బుకీలు
చేతులు మారుతున్న కోట్లు    
టాస్‌పైనా సాగుతున్న బెట్టింగ్

 
జిల్లా వాసులకు క్రికెట్ వరల్డ్‌కప్ ఫీవర్ పట్టుకుంది. ఏ దేశమైనా సరే.. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అయితే కదలడం కష్టమే. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బుకీరాయుళ్లు రంగంలోకి దిగారు. విచ్చలవిడిగా పందేలు కాస్తున్నారు. అందినకాడికి అడ్డంగా దోచేసి మధ్యతరగతి ప్రజలకు టోపీలు పెట్టేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే మూడు ఫోర్లు.. ఆరు సిక్సర్లుగా సాగుతోంది.
 
తిరుపతి, క్రైం:  క్రికెట్ బెట్టింగ్‌ల జోరు జిల్లాలో ఊపందుకుంది. మదనపల్లి, పలమనేరు, తిరుపతి నగరాల్లో బుకీ ఏజెంట్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. అధికంగా గెలుపు గుర్రాలపైనే బెట్టింగ్‌లు కాస్తున్నారు. తాజాగా ఇండియా -పాకిస్తాన్, ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్  సందర్భంగా జిల్లాలో కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారినట్టు సమాచారం. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి ప్రధాన దేశాలు ఆడినప్పుడు ప్రతిబాలుకూ, సిక్సర్లకు, ఫోర్లకు బెట్టింగ్ కట్టేవారి సంఖ్య పెచ్చుమీరుతోంది. ఇక జట్లు వారీగా బెట్టింగ్ కట్టేవారి సంఖ్య లక్షల్లోనే ఉన్నట్టు సమాచారం. చిన్న జట్టయినా.. గెలుస్తుందనే నమ్మకంతో వేలకు వేలు కుమ్మరిస్తున్నారు. కొందరు మ్యాచ్‌కు ముందుగానే టాస్‌పై కూడా బెట్టింగ్ కాస్తున్నట్టు తెలుస్తోంది.
 
కేరాఫ్ హైదరాబాద్


హైదరాబాద్ కేంద్రంగా బుకీ వ్యవస్థ నడుస్తున్నట్టు సమాచారం. వారి ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు రెండు వేల మంది బుకీలు తిష్టవేసినట్టు తెలిసింది. వీరు ప్రధానంగా స్టార్ హోటళ్లనే ఎంచుకుని తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం.
 
లావాదేవీలు ఎలా జరుగుతాయంటే

బెట్టింగ్‌లకు సంబంధించి అంతా ఆన్‌లైన్‌లోనే ఈ వ్యవహారమంతా కొనసాగుతుంది. బ్యాంకు అకౌంట్, ఆన్‌లైన్ అకౌంట్ డబ్బులు చెల్లిస్తుంటారు. ఓ ఏజెంట్ ద్వారా బెట్టింగ్ టీమ్‌లో చేర్చుకున్నారంటే అతనిపై నమ్మకంతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన బ్లాంక్ చెక్, డబ్బులకు సంబంధించి లీగల్ టెర్మనాలజీలో లావాదేవీలు రాసుకుంటారు. కస్టమర్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయినా.. సరే.. బ్యాంకు ద్వారా చెల్లించాల్సిందే. లేని పక్షంలో సాధారణ ఏజెంట్లు, బుకీలు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటారు. వీరుచేసేది న్యాయపరమైంది కాకపోయినా లీగల్‌గా కమిట్‌మెంట్ అయిన తర్వాతనే బెట్టింగ్ టీమ్‌లో స్థానం లభిస్తుండడంతో పోలీసులూ ఏమీ చేయలేని పరిస్థితి.

ఎప్పటికప్పుడు మకాం మార్చడం

ఈ వ్యవస్థలో అంతా 20-20 మ్యాచ్ లెక్కన సాగుతోంది. ఏజెంట్లు, బుకీలు ఎప్పటికప్పుడు తప్పించుకునేందుకు సెల్‌ఫోన్లు, మకాంలు మార్చడం రివాజుగా సాగుతోంది. ఇందులో పెద్ద పెద్ద ఏజెంట్లు స్టార్‌హోటళ్లను ఎంచుకోగా మరికొందరు పట్టణాలకు సమీపంలోని ఇళ్లల్లో మకాం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లు స్టార్ హోటళ్లలోనే మకాం వేసి క్రికెట్ వీక్షిస్తూ బెట్టింగ్ కట్టేవారి కాల్స్ స్వీకరిస్తారు. ఈ సమాచారం బుకీలకు చేరవేస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లాభం వస్తే డబ్బు బ్యాంక్ అకౌంట్‌కు వస్తుంది. డబ్బులు పోయిన పక్షంలో సదరు బెట్టింగ్‌కట్టిన వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారు. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు లేనిపక్షంలో తెల్లవారే సరికి బ్యాంకు పనిచేసే వేళల్లో ఏజెంట్ల అకౌంట్లలో జమచేయాలి. లేకుంటే ముందుగానే రాసుకున్న లీగల్ టెర్మినాలజీ ప్రకారం కోర్టుకు లాగుతారు. ఈ వ్యవహారంలో మధ్యతరగతి వారే ఎక్కువగా చితికిపోతున్నట్టు సమాచారం. పోలీసులు బుకీవ్యవస్థను, ఏజెంట్లపై ఓ కన్నేయాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement