
మహిళలపై వేధింపుల కేసులు పెరిగాయి: డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలను శాంతియుతంగా అదుపుచేశామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై 531 కేసుల నమోదు చేశామన్నారు. మొత్తం 3249 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. 163 మంది మావోమయిస్టులను అదుపులోకి తీసుకున్నామని, 76 మంది లొంగిపోయారని చెప్పారు.
ఈ ఏడాది 1435 అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 11420 చీటింగ్ కేసులు నమోదయినట్టు చెప్పారు. మహిళలకు వేధింపులపై 25998 కేసులు నమోదు చేశామన్నారు. 2012తో పోలిస్తే మహిళలపై వేధింపుల కేసులు 15.11శాతం పెరిగినట్టు డీజీపీ తెలిపారు.
గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని డీజీపీ అన్నారు. 2009 నుంచి రాష్ట్రంలో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయని, తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలు, ఉద్యమాల సమయంలో పోలీసులు ఏ ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించారన్నారు.
పోలీసులు వ్యవహరించిన తీరును డీజీపీ ప్రశంసించారు. ఏడాది ముగుస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితుల్లో ఆందోళనకారులపై చర్యలు తీసుకునేప్పుడు ఎవరూ మరణించకపోవడం పోలీసుల ఘనత అని ఆయన అన్నారు.