సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు శాతం నేరాలు తగ్గాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘2019 వార్షిక నేర నివేదిక’ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో అనేక రాష్ట్రాలు మనరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని, పోలీసులతోపాటు హోంగార్డులకు కూడా బీమా వర్తింపజేశామని చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం, పోలీసుల సంక్షేమం కోసం వీక్లీఆఫ్, బాధితులకు న్యాయం చేసేలా ‘స్పందన’, జీరో ఎఫ్‌ఐఆర్ మొదట మన రాష్ట్రంలోనే అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్ర పోలీసులకు తొమ్మిది విభాగాల్లో స్కోచ్ అవార్డులు, డీఎస్‌సీఐ, జీఫైల్స్ వంటి జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ప్రధాని మోదీ మొదలుకొని పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖుల నుంచి అభినందనలు అందుకోవడం గర్వకారణమన్నారు.
నేరాల సంఖ్య తగ్గింది
రాష్ట్రంలో 2018లో 1,19,541 కేసులు నమోదు కాగా, 2019లో 1,12,697 (వీటిలో 5,080 కేసులు ఎన్నికల సమయంలో నమోదు చేసినవే) కేసులు నమోదయ్యాయని డీజీపీ సవాంగ్ చెప్పారు. ఈ ఏడాది హత్యలు, అత్యాచారాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఎన్నికల వల్ల కేసుల నమోదు ఎక్కువైందని.. లేదంటే నేరాలు పది శాతం వరకు తగ్గేవన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు కేవలం రెండు జిల్లాలు (విశాఖ, తూర్పు)కే పరిమితమయ్యాయని తెలిపారు. మద్యం బెల్ట్ షాపులు, గుట్కా, అక్రమంగా ఇసుక తరలింపు, గంజాయిలపై ఉక్కుపాదం మోపామన్నారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్‌తో 5,739 మంది బాలబాలికలను గుర్తించి వారిలో 5,208 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. ‘ట్వంటీ ట్వంటీ(2020) ఉమెన్ సేఫ్టీ’ అనే నినాదంతో పనిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మహిళల భద్రతపై మరింత దృష్టి సారిస్తామన్నారు. దిశ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. దిశ ఘటన నేపథ్యంలో డిసెంబర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ కింద 49 కేసులు నమోదు చేశామన్నారు.
నేరాలు 6% తగ్గాయి
Published Mon, Dec 30 2019 3:05 AM | Last Updated on Mon, Dec 30 2019 7:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment