పోలీసులకు తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కూడా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నాయకులు శుక్రవారమిక్కడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై నేర పూరితమైన కుట్ర(సెక్షన్ 120బీ), హత్యాయత్నం(307) కింద కేసు నమోదు చేయాలని వారు కోరారు.
సిక్కుల ఆగ్రహానికి బలైన ఇందిరాగాంధీ, శ్రీలంక తమిళుల ఆగ్రహానికి ప్రాణాలు కోల్పోయిన రాజీవ్‌గాంధీకి పట్టిన గతే సోనియాగాంధీకి పడుతుందని అనడం ద్వారా అన్యాపదేశంగా ఆమె హత్యకు గురవుతారని చంద్రబాబు హెచ్చరించడం దారుణమని అన్నారు. ఇంతటి దారుణ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై తక్షణం కేసు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. వెయ్యిమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు. కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణను ఆపాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ
Published Sat, Oct 26 2013 12:59 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement