మచిలీపట్నం : ప్రముఖుల కిడ్నాప్, హత్యలు చేయడానికి మచిలీపట్నం వచ్చిన వైఎస్సార్ జిల్లాకు చెందిన పేరుమోసిన నేరస్తుడు మండ్ల సునీల్ కుమార్‌ను స్థానిక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్పీ జి.విజయకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మండ్ల వెంకట సునీల్ కుమార్ అనంతపురంలో బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. కొంతకాలం ఆటో నడిపాడు. ఆ సమయంలోనే ఇంజనీరింగ్ విద్యార్థులతో స్నేహం పెంచుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వైఎస్‌ఆర్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ధనవంతులను కిడ్నాప్ చేసి, వారి కుటుంబీకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తుంటాడు. సునీల్‌కుమార్‌పై 10 కిడ్నాప్‌లు, రెండు హత్యలు, రెండు చీటింగ్ కేసులు, ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌కుమార్‌పై రౌడీషీట్ తెరిచారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో సునీల్‌కుమార్‌తో పాటు అతని స్నేహితులను ఆగస్టు 11న పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న వాయిదా నిమిత్తం పోలీసులు కడప జైలు నుంచి వేముల వీరాస్వామితో పాటు సునీల్‌కుమార్‌ను అనంతపురం కోర్టుకు తీసుకువచ్చారు. వాయిదా అనంతరం కడప జైలుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బంది నుంచి తప్పించుకుని పారిపోయాడు.
కడప జైలులో పథక రచన
వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మచిలీపట్నంకు చెందిన వేముల వీరాస్వామి, మండ్ల సునీల్‌లకు కడప జైలులో పరిచయం ఏర్పడింది. తన తండ్రిని గంజాల నాగరాజు, శ్రీనివాస్, మరికొందరు మచిలీపట్నంలో దారుణంగా హత్య చేశారని, వారిని చంపాలని వీరాస్వామి అతడికి తరచూ చెబుతూ ఉండేవాడు. వీరాస్వామి తండ్రిని చంపిన వారిని హతమార్చేందుకు సునీల్‌కుమార్ అంగీకరించాడు.
మచిలీపట్నంకు చెందిన తన స్నేహితుడు శలపాటి రాజేష్‌ను కలిస్తే ఆర్థిక సాయంతో పాటు సహాయకారిగా ఉంటాడని వీరాస్వామి అతడికి చెప్పాడు. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ ఈ నెల 11న పోలీసుల నుంచి తప్పించుకుని అనంతపురం నుంచి తిరుపతి వెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న శలపాటి రాజేష్‌కు ఫోన్ చేసి తనకు కొంత నగదు కావాలని ఓ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చాడు. రాజేష్ ఆ నంబరులో నగదు వేశాడు. సునీల్‌కుమార్ తిరుపతి నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి బస్సులో మచిలీపట్నం వచ్చాడు. రాజేష్ అతడిని కలుసుకుని ముస్తాఖాన్‌పేటలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు.
కిడ్నాప్, హత్యలు చేసేందుకు రెక్కీ
వీరిద్దరూ కలిసి పట్టణంలోని బంగారు వ్యాపారుల ఇళ్లు, షాపుల వద్ద, ప్రముఖ వైద్యుల ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించారు. వీరాస్వామి తండ్రి హత్య కేసులో నిందితులైన గంజాల నాగరాజు, శ్రీనివాస్ తదితర ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించారు. వీరాస్వామి తండ్రిని చంపిన వారిని హతమార్చేందుకు కొంతమంది వ్యక్తుల సాయంతో పాటు కత్తులు, ఇనుపరాడ్లు కావాలని రాజేష్‌కు సునీల్‌కుమార్‌ను పురమాయించాడు. సునీల్ మచిలీపట్నంలో ఉన్నాడని అనంతపురం, కడప పోలీసులకు సమాచారం అందింది. వారు క ృష్ణాజిల్లా పోలీసులతో కలిసి అతడి కదలికలపై నిఘా ఉంచారు. అతడు రాజేష్‌తో కలిసి తిరుగుతున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. సోమవారం రాత్రి ముస్తాఖాన్‌పేటలోని రాజేష్ ఇంట్లో ఉన్న సునీల్‌కుమార్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. రాజేష్ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని, ఒక హత్యాయత్నం కేసుతో పాటు మూడు కేసుల్లో అతడు నిందితుడని ఎస్పీ తెలిపారు. రాజేష్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
వీరాస్వామి తండ్రిని హతమార్చిన వారిని హత్య చేయటంతో పాటు మచిలీపట్నంలోని ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే సునీల్‌కుమార్ మచిలీపట్నం వచ్చినట్లు తమ విచారణలో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. సునీల్‌ను అదుపులోకి తీసుకోవడానికి మచిలీపట్నం రూరల్ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి, అనంతపురం, కడప పోలీసులు తమకు సహకారం అందించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బీడీవీ సాగర్, బందరు డీఎస్పీ కెవి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం సునీల్‌కుమార్‌ను పోలీసులు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 29 వరకు అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సునీల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
క్రిమినల్ సునీల్ అరెస్ట్
Published Wed, Dec 17 2014 3:43 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement