కమలనాథులకు రాముడి తంటా! | Critical situation for bjp in seemandhra, Telangana over Bhadrachalam | Sakshi
Sakshi News home page

కమలనాథులకు రాముడి తంటా!

Published Thu, Nov 21 2013 2:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Critical situation for bjp in seemandhra, Telangana over Bhadrachalam

  • భద్రాచలాన్ని వదిలే ప్రసక్తే లేదు: తెలంగాణ నేతలు
  •   పోరాడి సాధించుకుంటాం: సీమాంధ్ర నేతలు
  •  సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ‘భద్రాద్రి రాముడి’తో కమలనాథులకు చిక్కొచ్చింది. భద్రాచలం తమకంటే తమకని పట్టుబడుతున్నారు. బీజేపీ సీమాంధ్ర నేతలు ఈమేరకు గుంటూరులో తీర్మానం చేసి 24 గంటలు గడవకమునుపే తెలంగాణ నేతలు బుధవారమిక్కడ భేటీ అయి కస్సుమన్నారు. ‘రాముడంటే తెలంగాణ, తెలంగాణ అంటే రాముడు’ అని గర్జించారు. అంగుళాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చే వ్యక్తులపై అవసరమైతే వేటు వేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పరిణామాలు, తెలంగాణ పునర్‌నిర్మాణం, సమైక్యపరుగు ఏర్పాట్లను చర్చించేందుకు తెలంగాణ నేతలు, పదాధికారులు సమావేశమయ్యారు. 
     
     బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, సీహెచ్ విద్యాసాగరరావు, ప్రొఫెసర్ శేషగిరిరావు, పార్టీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు అశోక్‌యాదవ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. సీమాంధ్ర నేతల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. సమావేశం అనంతరం యెండల, యెన్నం, ఎస్.కుమార్ మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు భద్రాచలం, హైదరాబాద్ సహా పది రెవెన్యూ జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమన్నారు. భద్రాచలాన్ని వేరు చేస్తే అంగీకరించబోమన్నారు. మరోవైపు బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత మాలతీరాణి పార్టీ కార్యాలయంలోనే మీడియాతో మాట్లాడుతూ భద్రాచలాన్ని వదిలే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. పోలవరం ప్రాజెక్టును సజావుగా నిర్మించాలంటే ముంపు ప్రాంతాలన్నీ సీమాంధ్రలోనే ఉండాలన్నారు. భద్రాచలం కోసం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement