రైతు దీక్షను విమర్శించడం అనైతికం
అనంతపురం అర్బన్: రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన తణుకులో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుదీక్షను విమర్శించేస్థాయి టీడీపీ రౌడీ మూకలకు లేదని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాదరణ ఓర్వలేక స్థాయి లేని నాయకులు దీక్షను విమర్శిస్తూ.. ఎక్కడ తమ పార్టీ మనుగడ కోల్పోతోందన్న భయంతో పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.
ప్రజలను మోసం చేసి చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి పాలన చేపట్టినప్పుడు ప్రజలు ‘రామరాజ్యం చూడలేదు కానీ.. రాజన్న రాజ్యం చూశామ’ని కోట్లాది మంది ప్రజలు అన్నారన్నారు. ఆ మహానేతను విమర్శించే స్థాయి ఈ రౌడీ ముఖలకు ఉందా..? అంటూ ధ్వజమెత్తారు. ఎవరి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో బహిరంగ బ్యాలెట్‌కు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబుకు ప్రభుత్వంపై ఆరు మాసాలకే ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. దీనికి నిదర్శనం పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన రైతుదీక్షేనన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారన్నారు. అక్కడి ప్రజలు వేలాదిగా రైతుకు దీక్షకు తరలివెళ్లడం గమనార్హం.
ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గిరిజనల సంక్షేమ కోసం గోరంట్ల మండలంలో భూములు పంచితే.. ఇప్పుడు ఆ భూములను వెనక్కిలాక్కుంటున్నారన్నారు. మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ‘నారావారి మాటలు.. నీటి మూటలే’ అన్నట్లుగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలాగానే మిగిలిపోయాన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గౌస్‌మొద్దీన్, నల్లచెరువు సర్పంచ్ ఎం. రవికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.