రైతుకోసం.. ‘రైతు దీక్ష’ చేపట్టిన నేత వైఎస్ జగన్
చాపాడు: రైతులు, డ్వాక్రా రుణాల మాఫీలో ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు రైతు దీక్షను చేపట్టారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలతో పాటు ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో చేపట్టిన ‘రైతు దీక్ష’కు శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమ శిక్షణా కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తమ అనుచరులతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని తన నివాసంలో రఘురామిరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు.
వైఎస్ జగన్ దీక్షకు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతల మద్దతు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రెండు రోజుల రైతు దీక్షకు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాయచోటి, కమలాపురం, కడప, రైల్వేకోడూరు, బద్వేలు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములులతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ దేవనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్‌మోహన్‌రెడ్డి, పలువురు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు జగన్ రైతు దీక్షలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.