అచ్చంపేట, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి పంటలు పండించి న అన్నదాతకు చివరికి శోకమే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న రెక్కలకష్టం వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, రాగులు, శనగ పంటలు కళ్లముందే నాశనమవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతికొచ్చిన పంటలు వరదలకు కొట్టుకుపోవడంతో కలతచెంది.. ఇద్ద రు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు.కాగా, ఇప్పటివరకు ఎంతనష్టం వాటిల్లిందనే స్పష్టమైన నష్టం నివేదికలను అధికారులు తయారుచేయలేకపోయారు.
నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధి లో సుమారు రూ.50కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. వరి 6908 ఎకరాలు, పత్తి 34,565 ఎకరాలు, వేరుశనగ 25,706 ఎకరాలు, మొక్కజొన్న 37,435 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రసాగర్, బల్మూర్, కొండనాగుల, బిల్లకల్ ప్రాంతాల్లోని చెరువుల్లో వదిలిన చేపలు కొట్టుకుపోవడంతో స్థానిక మత్సకారులకు తీవ్రనష్టం జరిగింది. చంద్రవాగు, కానుగులవాగు, రోళ్లపాయ, చంద్రసాగర్ వాగు, దుందుబీనది వాగులో వందకుపైగా కరెంట్ మోటార్లు కొట్టుకుపోయాయి. దీంతో తేరుకోలేనిస్థితిలో రైతులు ఉన్నారు.
దెబ్బతిన్నరోడ్లు
వర్షాలు, వరదతాకిడి కి అచ్చంపేట ఆర్‌అండ్‌బీ సబ్‌డివిజన్ పరిధిలో 300కి.మీ మేర రోడ్లు కొట్టుకుపోయాయి. అచ్చంపేట-శ్రీశైలం ప్రధాన రహదారి చంద్రవాగుపై తాత్కలిక కల్వర్టు తెగిపోయింది. ఈ రోడ్డు పునరుద్ధరణకు ఇంకా పదిరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తెల్కపల్లి-లింగాల మార్గంలో కల్వర్టు దెబ్బతిన్నాయి. ఒక అచ్చంపేట మండలంలోనే 23 రోడ్లు, కల్వర్టులు అధికారుల అంచనా. బొమ్మన్‌పల్లి -అక్కారం వెళ్లే మార్గంలో ఆరుప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బొమ్మనపల్లి- సిద్ధాపూర్ రహదారిలోని మన్నగుబ్బలవాగు వద్ద తాత్కలికంగా మరమ్మతు పనులు చేపట్టారు.
మర్లపాడుతండా వద్ద కానుగులవాగు బ్రిడ్జి వద్దరోడ్డు తెగిపోవడంతో ఘనపూర్- లింగాయిపల్లి గ్రామాల ప్రజలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. మన్నెవారిపల్లి- చందంపేట మండల కేంద్రం మధ్య దుందుబీ నది పొంగిపొర్లడంతో రోడ్డు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అమ్రాబాద్ మండలం మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్-మద్దిమడుగుల రహదారితో పాటు 23 రహదారులు, కల్వర్టులు కోతకు గురయ్యాయి. ఉప్పునుంతల మండలంలో 22 గ్రామాల రోడ్లు కోతకు గురయ్యాయి. అలాగే వంగూరు మండలంలో 35రోడ్లు దెబ్బతిన్నాయి.
తెగిన చెరువులు, కుంటలు
నియోజకవర్గంలో ఎనిమిది కుంటలు, ఆరు చెరువులు, అలుగు, తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. అచ్చంపేట మండల సిద్ధాపూర్ పాతచెరువుకు గండిపడి వందెకరాల్లో వరిపంట కొట్టుకుపోయింది. పొలాల్లో ఇసుకమేటలు, రాళ్లు, మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. బల్మూర్ మండలం బాణాల, లక్ష్మిపల్లిలో కుంటలు తెగి పొలాలు కోతకు గురై వ్యవసాయనికి పనికిరాకుండా పోయాయి.
రుసుల్ చెరువు వాగు పొంగిపొర్లడంతో బాణాల సమీపంలో పంటలు కొట్టుకుపోయాయి. నియోజకవర్గంలో 1789 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు అంచనాలు తయారుచేశారు. ప్రభుత్వం పూర్తిగా ఇళ్లు కూలిపోయి నిరాశ్రుయులైన వారికి రూ.15వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.6500, కొంతమేర దెబ్బతిన్న ఇంటికి రూ.2500, పూరి గుడిసెలకు రూ.900లు చెల్లించే విధంగా ఆదేశాలు జారీచేశారు.
ప్రాణనష్టం..
వాగులు ఉధృతంగా పొంగిపొర్లడంతో నీటిలోకొట్టుకుపోయి ముగ్గురు మృతిచెందారు. జిన్‌కుంటకు చెందిన బాలమ్మ(48) పొలం నుంచి వస్తూ పెనిమిళ్లవాగు దాటుతుండగా కొట్టుకపోయి మృతిచెందింది. కుమ్మరోనిపల్లి వాగు దాటుతుండగా చిట్లంకుంటకు చెందిన నాకనమోని వెంకటయ్య(35)నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. లక్ష్మాపూర్(బీకే)కు చెందిన మూడావత్ లక్ష్మణ్(55) వర్షానికి తడిసి మృతిచెందాడు. లింగాల మండలం శ్రీరంగాపూర్‌కు చెందిన పోతయ్య(35) పొట్టకూటి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి వాగులో కొట్టుకుపోయి శవమై కనిపించాడు.
బల్మూర్ మండలం పొలేపల్లికి చెందిన రైతు వాపని మల్లయ్య(45) వర్షానికి పంటనాశనం కావడంతో కలతచెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోరైతు లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్ (35)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదమే మిగిలింది.