కోటీశ్వరులతో బాబు కుమ్మక్కు
బుక్కరాయసముద్రం : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశ ప్రధాని నరేంద్రమోడి కుమ్మక్కయ్యారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమానికి తిలోదకాలిచ్చి ఇద్దరూ విదేశీ పర్యటనకు సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులను అణగదొక్కేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలనడం దారుణమని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదేపంథాను అనుసరించడం దారుణమని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటూ రైతులకు సంబందించిన భూమలను లాక్కొని కోట్ల రుపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదోనికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు ఆవుల శేఖర్, భీమలింగప్ప, కేశవరెడ్డి, జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు.