ప్రభుత్వ సభలో రాజకీయాలా? | Politics Government in the House? | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సభలో రాజకీయాలా?

Published Thu, Jun 11 2015 1:56 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Politics Government in the House?

చంద్రబాబు తీరును ఎండగట్టిన సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ
 
 ఒంగోలు టౌన్ : ‘మంగళగిరిలో జరిగిన సభకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు. ప్రభుత్వ నిధులతో జనాలను తరలించారు. ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి సభలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛాలెంజ్‌లు విసిరారు. రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సన్నని విభజన రేఖను పూర్తిగా మార్చివేశారని’ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు తీరును ఎండగట్టారు. సీపీఐ జిల్లా కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక మల్లయ్య లింగం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా నడుస్తున్నాయన్నారు.

 ఎవరిపై తొడ కొడుతున్నావు?
 ‘దొంగ దొరికితే ముసుగు వేసుకొని బయటకు వస్తాడు. ఎవరైనా చూస్తారన్న అవమానంతో తల దించుకొని వెళతాడు. అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి బయటకు వస్తూ మీసాలు మెలేశాడు. అంతటితో ఆగకుండా తొడ కొట్డాడు. తలవంచుకొని వెళ్లాల్సిన వ్యక్తి ఎవరిపై ఆయన తొడ కొట్టాడో అర్థం కావడం లేదని’ రామకృష్ణ పేర్కొన్నారు. జైలులో ఉన్న రేవండ్‌రెడ్డికి మనోస్థైర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించుకొందని, ఆయన ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. నోట్ల కట్టల కుంభకోణంలో జైలులో ఉన్న వ్యక్తికి నైతిక స్థైర్యం కల్పించేందుకు అనుమతి తీసుకొని క్యాబినెట్ అంతా చర్లపల్లి జైలుకు వెళితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

 జిల్లా వెనుకబాటుతనంపై ఒంగోలులో సదస్సు:
 జిల్లా వెనుకబాటుతనంపై త్వరలో ఒంగోలులో సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ విభజన బిల్లును అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నిర్ణయించిందని, మహబూబ్‌నగర్, అనంతపురం కంటే ప్రకాశం జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
 ఓటుకు నోటును సీబీఐతో విచారించాలి - ముప్పాళ్ల
 ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడం ద్వారా వ్యాపారంగా మార్చివేశాయని విమర్శించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలుపుతున్నారన్నారు. పవిత్రమైన రాజకీయ ఉద్యమాల కోసం సీపీఐ ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజలతో ఉద్యమించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ, సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు.
 
 16 నుంచి ప్రజల వద్దకు సీపీఐ
  ఒంగోలు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రజల వద్దకు సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ వెల్లడించారు. పక్షం రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిం చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థానిక మల్లయ్య లింగం భవనంలో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడంతోపాటు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారన్నారు. వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గసభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, కేవీవీ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డీ సర్ధార్, పీవీఆర్ చౌదరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీ హనుమారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రావు, జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలు రావమ్మతోపాటు జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement