కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ విభాగం ఎన్నికలు ఆదివారం ఐఎంఏ హాల్‌లో ఉత్కంఠభరితంగా జరిగాయి. రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికలు ఆదివారం ఓటింగ్ సమయంలోనూ అంతే ఉత్కంఠ రేపాయి. ప్రచారం సాధారణ ఎన్నికలను తలపించింది. వైద్యేతరులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని బయట ప్రచారం నిర్వహించారు. ఓ వర్గం వారు ప్యానెల్ పేర్లు, బయోడేటా ముద్రించిన పత్రంతోపాటు పువ్వులు ఇచ్చి ఎన్నికల్లో తమ వారికి ఓటువేయాలని అభ్యర్థించారు. డాక్టర్ జగన్మోహన్‌రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరిగింది. 480 మంది సభ్యులకు గాను 301 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలను రాత్రి 9 గంటలకు ప్రకటించారు.
ఫలితం వరకూ ఉత్కంఠే...
ఐఎంఏ కరీంనగర్ విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ హరికిషన్ 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి డాక్టర్ వసంతరావుకు 111 ఓట్లు రాగా, హరికిషన్ 178 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ మల్లికార్జున్ 204 ఓట్లు, డాక్టర్ యాకయ్య 174 ఓట్లు పొంది గెలుపొందారు. మూడు ఉపాధ్యక్ష పదవులకు గాను మహిళా కోటా నుంచి డాక్టర్ శోభ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యదర్శిగా డాక్టర్ వెంకటరెడ్డి 40 ఓట్ల మెజారిటీతో అక్షయ్ డానియెల్‌పై విజయం సాధించారు. కోశాధికారిగా ఎల్.రవికాంత్ (161 ఓట్లు) డాక్టర్ కె.వి.రవీందర్‌రెడ్డి(124 ఓట్లు)పై 37 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆరు కార్యవర్గ సభ్యుల పదవులకు గాను రెండు ఏకగ్రీవం కాగా పీఆర్ రాజేందర్(243), వి.వెంకటేశ్వర్లు(192), వి.రఘు(184), డాక్టర్ రాజిరెడ్డి(182 ఓట్లు) సాధించి విజయం సాధించారు.
ఏకగ్రీవమైనవారు వీరే..
ఐఎంఏ ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ శోభ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ఝాన్సీ, ఉమ, సంయుక్త కార్యదర్శిగా నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పొలాడి శ్రీనివాస్, సాయిప్రసాద్, రాంకిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫ్యామిలీ బెన్‌ఫిట్ స్కీమ్ సభ్యులుగా బీఎన్‌రావు, రవీందర్, ప్రొఫెషన్ ప్రొటెక్షన్ వర్కర్లుగా డాక్టర్ శౌరయ్య, హరిత, లోకల్ యాక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ అలీం, డాక్టర్ వి.లక్ష్మణ్, ఆకుల శైలజ, వి.రాంరెడ్డి , సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా పి.కిషన్, మధుసూధన్‌రావు, విఠల్‌రెడ్డి, జి. రవీందర్, ఆది శ్రీదేవి, సర్దారున్నీసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
ఉత్కంఠభరితంగా ఐఎంఏ ఎన్నికలు
Published Mon, Oct 7 2013 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement