పట్టపగలే ‘పాప'౦
సొంతంగా ఎగరడానికి బలం చాలని లేతరెక్కలు.. తల్లిపక్షి తెచ్చి నోటపెడితే తప్ప మేత కూడా తినలేని కూనలు.. ఉన్నట్టుండి ఆ తల్లి వేటగాడి బాణానికి బలైతే.. ఆ వేటగాడు మరెవరో కాక జన్మనిచ్చిన తండ్రే అయితే.. ఆ చిరుహృదయాల్లో ఎంత దుఃఖపు దావాగ్ని రగులుకుంటుంది? తమను కంటిని రెప్పలా కాచుకునే తల్లిని పోగొట్టుకున్న వేళ..
ఆ పసికళ్లకు పట్టపగలే ఎంత కటిక చీకటి కమ్ముకున్నట్టు అనిపిస్తుంది? ‘అమ్మా!’ అంటూ ఆర్తిగా తాము మెడను వాటేసుకుంటే.. ‘అమ్మలూ’ అంటూ లాలించిన అమ్మే.. ఆ మెడ తెగి, అమ్మోరికి బలి ఇచ్చిన మేకలా నేలపై నిర్జీవంగా పడి ఉన్న వేళ.. ఆ బిడ్డల మనసులు పిడుగులు పడ్డ కొలనుల్లా ఎంత కల్లోలితమై ఉంటాయి? తమకు రక్తం పంచి ఇచ్చిన వాడే.. తమకు పాలిచ్చి పెంచిన తల్లిని కడతేర్చి.. నెత్తురోడే కత్తితో కనిపించిన వేళ.. ఆ చిగురుటాకులు ఎంత కంపించి ఉంటాయి?
గురువారం రాజమండ్రి క్వారీ ఏరియాలో భార్యను వెంటాడి వెంటాడి నరికి చంపాడో అనుమానపు మగాడు. ఆ దారుణంతో.. గుండెల్లో ఏకకాలంలో సుడులు తిరిగే దుఃఖం, భీతి, నిస్సహాయత, విహ్వలతలు ముఖాల్లో ప్రతిఫలిస్తుండగా.. ఆ దంపతుల బిడ్డలు.. వైష్ణవి, అనిత ఇలా రోదిస్తుంటే.. చూసిన ప్రతి ఒక్కరికీ గుండె కలుక్కుమంది. కళ్లు జలజలా వర్షించాయి.
కంబాలచెరువు, న్యూస్‌లైన్ :అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా నరికి చంపాడు. రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావునగర్‌లో గురువారం పట్టపగలు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌కు చెందిన గోవిందుకు సింహాచల్‌నగర్‌కు చెందిన పాప(30)కు ఐదే ళ్లక్రితం ప్రేమ వివాహమైంది. గోవిందు బీరువాల కంపెనీలో పనిచేస్తుంటాడు. వీరికి అనిత(4), వైష్ణవి(2) అనే కుమార్తెలున్నారు. ఇటీవల గోవిందు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. దీంతో పాప సింహాచల్‌నగర్‌లోని అన్నవద్ద పిల్లలతో ఉంటోంది. అనంతరం పెద్దలు భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చి పాపను కాపురానికి పంపారు.
అయినా గోవిందు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా పాప వేరే వ్యక్తితో మాట్లాడడం చూసిన గోవిందు అనుమానం పెంచుకున్నాడు. కత్తి పట్టుకుని గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఆమె పనిచేస్తున్న ఇంటికి వెళ్లాడు. అప్పడే పిల్లల కోసం అన్నం పట్టుకుని పాప బయటకు వచ్చింది. భర్తను చూసి వెంటనే లోపలకు పరిగెత్తింది. గోవిందు ఆమె జట్టు పట్టుకు ని బయటకు లాగి కత్తితో మెడపై నరికాడు. దీంతో పాప అక్కడికక్క డే మృతి చెందిం ది.
అక్కడే రాళ్ల పనిచేసుకుంటున్న కొందరు భయంతో పరుగులు తీశారు. గోవిందు కత్తిని పక్కనే ఉన్న పొదల్లోకి విసిరి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. మూడో పట్టణ సీఐ రమేష్, ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పాప ఇద్దరు పిల్లలు అమ్మా అంటూ విలపించడం చూసి అందరి కళ్లు చమర్చాయి.