Kambala Cheruvu
-
నగ్న వీడియోలతో వేధింపులు: కరాటే కల్యాణి అండతో ఫిర్యాదు
సాక్షి, కంబాలచెరువు (తూర్పు గోదావరి): ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఒలీవల మందిరం పాస్టర్ షారోన్ కుమార్ తనను మోసం చేశాడని కడియం మండలం రెడ్డిపడల్లి గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రింయాక మంగళవారం రెండోపట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఒలీవల చర్చికి వెళ్తోంది. అక్కడ పాస్టర్ షారోన్ కుమార్ ఏకాంత ప్రార్థనలను ప్రోత్సహించేవాడు. తన భార్యతో విడాకులు అయిపోతున్నాయని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి తనవద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలను బహిర్గతం చేస్తానని భయపెడుతున్నాడు. దీంతో కొందరి సహకారంతో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణిని కలిసి తన బాధ చెప్పుకున్నానని, ఆమె ధైర్యంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని ప్రియాంక తెలిపారు. చదవండి: దారుణం: కాలిన గాయాలతో నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి.. -
‘అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రయత్నం’
సాక్షి, తూర్పుగోదావరి : కంబాల చెరువు ప్రాజెక్టు, ఇండోర్ స్టేడియం ఈ ఏడాదే పూర్తి చేస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ద ప్రెస్’లో ఎంపీ మాట్లాడుతూ.. రాజమండ్రిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజమండ్రి అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తున్నామన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని, గతంలో దీనికి నిధులు మంజూరు అయినా.. గత ప్రభుత్వం వేరే అకౌంట్‌కు నిధులు మళ్లించిందని దుయ్యబట్టారు. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో షిరిడి, తిరుపతి, విజయవాడకు విమానాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ విషయంపై త్వరలో ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఎంపీ తెలిపారు. అదే విధంగా దేవరపల్లి నుంచి గుండుగొలను వరకు అయిదు కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా ఉందని, దీనిని మరమ్మతులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ భరత్ వివరించారు. రోడ్డు మరమ్మతులకు దాదాపు రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, రాజమండ్రి కంబాల చెరువు పార్కులో వినూత్నంగా ఈ ఏడాది సౌండ్ ప్రూఫ్ దివాళి ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. కంబాల చెరువు పార్కులో మల్టీకలర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, రాజమండ్రి చరిత్రను తెలియజేప్పే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కంబాల చెరువు ప్రాజెక్టు, రాజమండ్రిని హెరిటేజ్ టూరిజం ప్రాంతంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. హితకారిణి సమాజం కళాశాలలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. గోదావరిలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక మిషన్‌ను తీసుకు వస్తున్నామని... రెండు మూడు నెలల్లోనే జిల్లాకు వస్తుందని తెలిపారు. -
బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు
కంబాలచెరువు (రాజమండ్రి) :కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే, బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు చూపించిందో వైద్యురాలు. ‘ఆ కేసు నాది కాదు.. ఆ డ్యూటీ డాక్టర్ వెళ్లిపోయాడు.. నేనేం చేయలేను’ అంటూ పురుటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి వైద్యం నిరాకరించింది. రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కడియానికి చెందిన జి.దుర్గకు తొలి కాన్పు సిజేరియన్ అయింది. రెండోసారి గర్భం ధరించిన ఆమె కొద్ది రోజుల కిందట రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ లక్ష్మణరావు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఈ నెల 17న పురుడు వస్తుందని, ఆ రోజు రావాలని చెప్పి, ఆమెను ఇంటికి పంపించివేశారు. ఈ నేపథ్యంలో దుర్గ సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ లక్ష్మణరావు, పురుడు రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పి, మంగళవారం డిశ్చార్జి చేశారు. ఆయన డ్యూటీ దిగిన సమయంలో నొప్పులు అధికమవడంతో విధుల్లో ఉన్న డాక్టర్ వసుంధరకు దుర్గ బంధువులు విషయం తెలిపారు. తనకేమీ తెలియదని, డాక్టర్ లక్ష్మణరావు ఇంటికి వెళ్లిపోవాలని రాసిచ్చారని, ఆ కేసు తాను ఇప్పుడు చూడనని డాక్టర్ వసుంధర చెప్పారు. దీంతో చేసేది లేక దుర్గ, ఆమె బంధువులు ఆస్పత్రి బయటే నిరాశగా ఉండిపోయారు. ఈలోగా ఆస్పత్రి సిబ్బంది ఒకరు వచ్చి ‘ఏం ఫర్వాలేదు, రూ.2 వేలు ఇస్తే లోపల చేర్చుకుని ఆపరేషన్ చేస్తారు’ అని తనకు చెప్పారని దుర్గ బంధువు కోడిబోయిన రమణ చెప్పాడు. ఈలోగా ఈ సమాచారం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. విషయం రచ్చ అయ్యేటట్టు ఉందని భయపడిన వైద్యులు దుర్గకు వైద్య సేవలు అందించారు. తాను పరుషంగా మాట్లాడలేదని డాక్టర్ వసుంధర ‘సాక్షి’కి చెప్పారు. -
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
కంబాలచెరువు : పిల్లలను ప్రిన్సిపాల్ జ్యోత్స్న వేధిస్తోంది అంటూ రాజమండ్రిలోని ఆర్యాపురంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టడంతో పాటు రోజూ మెకాళ్లపై నిలబెడుతోందని, గుంజీలు తీయిస్తోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. అంతేకాదు దీనిపై అడిగేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై కూడా జ్యోష్న దురుసుగా ప్రవర్తిస్తోందని, మీ పిల్లల్ని చదివిస్తే చదివించండి లేకపోతే తీసుకుపొండి అని అక్కడున్న ఫైళ్లను తమ ముఖాలపైకి విసిరికొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రిన్సిపాల్, ఏజీఎంలను నిలదీశారు. గతంలో తమ పిల్లల ఫీజులు రూ.17 వేలు చెప్పి ఇప్పుడు 24 వేలు చెల్లించమంటున్నారని, స్కూలు డ్రెస్ వేసుకుని రాకపోతే పిల్లలను చెంపలపై కొడుతున్నారని తక్షణం ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. పిల్లను ఎందుకు కొట్టావని ఓ విద్యార్థి తల్లి వస్తే ఆమెపై ప్రిన్సిపాల్ దాడి చేసిందని ఆరోపించారు. ఈ విషయాలన్నీ స్కూల్ ఏజీఎం వేణుగోపాల్‌కు చెప్పినా ఆయన ఏమీ స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన జరుగుతుండగా మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఏజీఎం వేణుగోపాల్, ప్రిన్సిపాల్ జ్యోత్స్న, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ను తొలగిస్తామని ఏజీఎం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడు వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. కాగా ప్రిన్సిపాల్‌తో తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున ్నట్టు తెలిసింది. గాజులు ఎప్పుడు తొలగిస్తారు స్కూల్‌కు పిల్లలు వేసుకుని వచ్చిన గాజులను ప్రిన్సిపల్ పగులకొట్టేస్తోంది. చెవికున్న వస్తువులను తీయించేస్తోంది. ఆడవాళ్లకు గాజులు ఏ సమయంలో పగులకొడతారు. అసలు వీళ్లు విద్యాబోధన చేస్తున్నారా? దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. - నాగరాజు, విద్యార్థిని తండ్రి పిల్లలను తీసుకెళ్లిపోమంటోంది ఏదైనా విషయం జరిగి అడిగేందుకు వస్తే దూకుడుగా మాట్లాడుతూ మీ పిల్లలను తీసుకునిపోండి అంటూ ప్రిన్సిపాల్ సమాధానం చెబుతోంది. పిల్లలను దారుణంగా హింసిస్తోంది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి. - జి.జ్యోతి, విద్యార్థి తల్లి నా ముఖానికి ఫైల్ విసిరి కొట్టింది మా అమ్మాయిని గూబపై కొట్టింది. దీనిపై అడిగేందుకు వెళితే టేబుల్‌పై ఉన్న ఫైల్‌ను నా ముఖానికి విసిరి కొట్టింది. భారీగా ఫీజులు చెల్లిస్తుంది మమ్మల్ని, మా పిల్లల్నీ కొట్టేందుకా?. దీనిపై విద్యాశాఖ స్పందించాలి. - కైరో, విద్యార్థి తల్లి -
పట్టపగలే ‘పాప'౦
సొంతంగా ఎగరడానికి బలం చాలని లేతరెక్కలు.. తల్లిపక్షి తెచ్చి నోటపెడితే తప్ప మేత కూడా తినలేని కూనలు.. ఉన్నట్టుండి ఆ తల్లి వేటగాడి బాణానికి బలైతే.. ఆ వేటగాడు మరెవరో కాక జన్మనిచ్చిన తండ్రే అయితే.. ఆ చిరుహృదయాల్లో ఎంత దుఃఖపు దావాగ్ని రగులుకుంటుంది? తమను కంటిని రెప్పలా కాచుకునే తల్లిని పోగొట్టుకున్న వేళ.. ఆ పసికళ్లకు పట్టపగలే ఎంత కటిక చీకటి కమ్ముకున్నట్టు అనిపిస్తుంది? ‘అమ్మా!’ అంటూ ఆర్తిగా తాము మెడను వాటేసుకుంటే.. ‘అమ్మలూ’ అంటూ లాలించిన అమ్మే.. ఆ మెడ తెగి, అమ్మోరికి బలి ఇచ్చిన మేకలా నేలపై నిర్జీవంగా పడి ఉన్న వేళ.. ఆ బిడ్డల మనసులు పిడుగులు పడ్డ కొలనుల్లా ఎంత కల్లోలితమై ఉంటాయి? తమకు రక్తం పంచి ఇచ్చిన వాడే.. తమకు పాలిచ్చి పెంచిన తల్లిని కడతేర్చి.. నెత్తురోడే కత్తితో కనిపించిన వేళ.. ఆ చిగురుటాకులు ఎంత కంపించి ఉంటాయి? గురువారం రాజమండ్రి క్వారీ ఏరియాలో భార్యను వెంటాడి వెంటాడి నరికి చంపాడో అనుమానపు మగాడు. ఆ దారుణంతో.. గుండెల్లో ఏకకాలంలో సుడులు తిరిగే దుఃఖం, భీతి, నిస్సహాయత, విహ్వలతలు ముఖాల్లో ప్రతిఫలిస్తుండగా.. ఆ దంపతుల బిడ్డలు.. వైష్ణవి, అనిత ఇలా రోదిస్తుంటే.. చూసిన ప్రతి ఒక్కరికీ గుండె కలుక్కుమంది. కళ్లు జలజలా వర్షించాయి. కంబాలచెరువు, న్యూస్‌లైన్ :అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా నరికి చంపాడు. రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావునగర్‌లో గురువారం పట్టపగలు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌కు చెందిన గోవిందుకు సింహాచల్‌నగర్‌కు చెందిన పాప(30)కు ఐదే ళ్లక్రితం ప్రేమ వివాహమైంది. గోవిందు బీరువాల కంపెనీలో పనిచేస్తుంటాడు. వీరికి అనిత(4), వైష్ణవి(2) అనే కుమార్తెలున్నారు. ఇటీవల గోవిందు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. దీంతో పాప సింహాచల్నగర్లోని అన్నవద్ద పిల్లలతో ఉంటోంది. అనంతరం పెద్దలు భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చి పాపను కాపురానికి పంపారు. అయినా గోవిందు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా పాప వేరే వ్యక్తితో మాట్లాడడం చూసిన గోవిందు అనుమానం పెంచుకున్నాడు. కత్తి పట్టుకుని గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఆమె పనిచేస్తున్న ఇంటికి వెళ్లాడు. అప్పడే పిల్లల కోసం అన్నం పట్టుకుని పాప బయటకు వచ్చింది. భర్తను చూసి వెంటనే లోపలకు పరిగెత్తింది. గోవిందు ఆమె జట్టు పట్టుకు ని బయటకు లాగి కత్తితో మెడపై నరికాడు. దీంతో పాప అక్కడికక్క డే మృతి చెందిం ది. అక్కడే రాళ్ల పనిచేసుకుంటున్న కొందరు భయంతో పరుగులు తీశారు. గోవిందు కత్తిని పక్కనే ఉన్న పొదల్లోకి విసిరి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. మూడో పట్టణ సీఐ రమేష్, ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పాప ఇద్దరు పిల్లలు అమ్మా అంటూ విలపించడం చూసి అందరి కళ్లు చమర్చాయి. -
అభిమానుల ప్రార్థనలతో కుట్రలు చేధించుకొచ్చా: జగన్
రాజమండ్రి: అభిమానాలు అందరి ప్రార్థనలు, ఆత్మీయత, ఆ దేవుడి దీవెనలతో కుట్రలను చేధించుకుని మీ మధ్యకు రాగలిగానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. కంబాల చెరువు జంక్షన్‌కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. జక్కంపూడి ఇంట్లో ఇటీవల వివాహమైన సింధు దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జంక్షన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న జనంను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సమైక్య శంఖారావాన్ని పూరిస్తానని జగన్ చెప్పారు. ప్రసంగించాలని జనం కోరారు. తాను ఎక్కవ సమయం మాట్లాడలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని కోరారు. తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఉప్పొంగి ప్రజాభిమానం అంతకు ముందు మధురపూడి విమానాశ్రయం నుంచి జగన్ రాజమండ్రి రావడానికి నాలుగు గంటలు పైగా సమయం పట్టింది. ప్రజాభిమానం ఉప్పొంగటంతో జగన్ ముందుకు కదలలేకపోయారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వెళ్లారు. విమానాశ్రయం వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది. మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు వరకు దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. -
ఉప్పొంగిన ప్రజాభిమానం - ముందుకు కదలలేకపోతున్న జగన్
-
ఉప్పొంగిన ప్రజాభిమానం
రాజమండ్రి: ప్రజాభిమానం ఉప్పొంగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముందుకు కదలలేకపోతున్నారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. విమానాశ్రయం వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది. మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు రావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి. రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్‌కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అక్కడ భారీ స్థాయిలో గుమ్మిగూడిన జనంను ఉద్దేశించి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు. ప్రసంగించాలని జనం కోరారు. అయితే తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.