
ఉప్పొంగిన ప్రజాభిమానం
రాజమండ్రి: ప్రజాభిమానం ఉప్పొంగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముందుకు కదలలేకపోతున్నారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. విమానాశ్రయం వద్ద జగన్కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది.
మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు రావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి.
రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అక్కడ భారీ స్థాయిలో గుమ్మిగూడిన జనంను ఉద్దేశించి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు. ప్రసంగించాలని జనం కోరారు. అయితే తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.