సాక్షి, బెంగళూరు/రేణిగుంట: రాజమండ్రి నుంచి తిరుపతికి వచ్చిన ఇండిగో విమానం సాంకేతిక కారణాల దృష్ట్యా ఇక్కడ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే చక్కర్లు కొట్టించి.. చివరకు అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు. అందులోని ప్రయాణికులు సుమారు 4 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ విమానంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి 70మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం బయల్దేరింది. 10.30 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయి.. 11.15 గంటలకు తిరిగి రాజమండ్రి వెళ్లాల్సి ఉంది.
కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనుకుంటున్న సమయంలో పైలట్ చాలాసేపు విమానాన్ని రేణిగుంట చుట్టుపక్కల గాల్లోనే తిప్పారు. ల్యాండింగ్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. ప్రయాణికులకు మాత్రం మబ్బుల వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారిందని, దీనికితోడు ఫ్యూయెల్ కూడా అయిపోతోందని, విమానాన్ని బెంగళూరుకు అత్యవసరంగా మళ్లిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక దాని డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులంతా నాలుగు గంటలపాటు విమానంలోనే నిరీక్షించారు.
తిరుపతిలో దిగాల్సిన ప్రయాణికులను మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు విమానాశ్రయంలో వదిలేయడంతో అక్కడ నుంచి వారంతా అవస్థలు పడి రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరారు. సాంకేతిక సమస్యను నిపుణులు పరిష్కరించడంతో అక్కడే వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానం రేణిగుంటకు చేరుకుంది. కాగా, ఈ విమానం తిరుపతిలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట మీదుగా మధురైకు సాయంత్రం 4.30గంటలకు వెళ్లాల్సి ఉంది. అనూహ్య పరిణామంతో మధురైకు విమాన సర్వీసును ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇండిగోపై కేసు వేస్తా: రోజా
ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చామని విమాన సిబ్బంది చెప్పారన్నారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానాన్ని తిరుపతికి పంపుతామని తెలిపారన్నారు. టికెట్‌కు అదనంగా రూ.5 వేలు అడిగారని, ఇండిగో యాజమాన్యంపై కేసు వేస్తానని రోజా అన్నారు.
సాంకేతిక సమస్యతో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం
Published Tue, Dec 14 2021 1:29 PM | Last Updated on Wed, Dec 15 2021 4:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment