
బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు
కంబాలచెరువు (రాజమండ్రి) :కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే, బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు చూపించిందో వైద్యురాలు. ‘ఆ కేసు నాది కాదు.. ఆ డ్యూటీ డాక్టర్ వెళ్లిపోయాడు.. నేనేం చేయలేను’ అంటూ పురుటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి వైద్యం నిరాకరించింది. రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కడియానికి చెందిన జి.దుర్గకు తొలి కాన్పు సిజేరియన్ అయింది. రెండోసారి గర్భం ధరించిన ఆమె కొద్ది రోజుల కిందట రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ లక్ష్మణరావు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఈ నెల 17న పురుడు వస్తుందని, ఆ రోజు రావాలని చెప్పి, ఆమెను ఇంటికి పంపించివేశారు. ఈ నేపథ్యంలో దుర్గ సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ లక్ష్మణరావు, పురుడు రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పి, మంగళవారం డిశ్చార్జి చేశారు.
ఆయన డ్యూటీ దిగిన సమయంలో నొప్పులు అధికమవడంతో విధుల్లో ఉన్న డాక్టర్ వసుంధరకు దుర్గ బంధువులు విషయం తెలిపారు. తనకేమీ తెలియదని, డాక్టర్ లక్ష్మణరావు ఇంటికి వెళ్లిపోవాలని రాసిచ్చారని, ఆ కేసు తాను ఇప్పుడు చూడనని డాక్టర్ వసుంధర చెప్పారు. దీంతో చేసేది లేక దుర్గ, ఆమె బంధువులు ఆస్పత్రి బయటే నిరాశగా ఉండిపోయారు. ఈలోగా ఆస్పత్రి సిబ్బంది ఒకరు వచ్చి ‘ఏం ఫర్వాలేదు, రూ.2 వేలు ఇస్తే లోపల చేర్చుకుని ఆపరేషన్ చేస్తారు’ అని తనకు చెప్పారని దుర్గ బంధువు కోడిబోయిన రమణ చెప్పాడు. ఈలోగా ఈ సమాచారం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. విషయం రచ్చ అయ్యేటట్టు ఉందని భయపడిన వైద్యులు దుర్గకు వైద్య సేవలు అందించారు. తాను పరుషంగా మాట్లాడలేదని డాక్టర్ వసుంధర ‘సాక్షి’కి చెప్పారు.