
విశాఖసిటీ: మీ స్మార్ట్ ఫోన్‌లోకి ఎలుక దూరింది. అది.. వైర్లు కొరికే ఎలుక కాదు. మీ గాడ్జెట్‌ను సైబర్ నేరగాడి ఆధీనంలోకి తీసుకెళ్లిపోయే వైరస్. లింక్ వచ్చిందా.. యాప్ డౌన్‌లోడ్ చేశామా అన్నది ముఖ్యం కాదు. ఆ యాప్ ఎంత వరకూ కరెక్ట్.. అది మంచి కంపెనీ తయారు చేసిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మరి చిపోయిన వారందరికీ ఈ ర్యాట్ ఓ హెచ్చరిక.
తెల్లారింది మొదలు.. నిద్ర పోయే వరకూ ప్రతి పని కోసం స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన యాప్‌లనే వినియోగిస్తున్నారు. నూటికి 80 మందికి యాప్స్‌తోనే తెల్లారుతోంది. మెసేజ్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ వరకూ.. పెన్ను నుంచి ఫ్లయిట్ టికెట్స్ వరకూ తమకు కావాల్సిన అన్ని పనులకు దాదాపు యాప్స్‌నే వాడుతున్నారు. ఇలాంటి వారిని దోచుకునేందుకు ఇప్పుడు సైబర్‌నేరగాళ్లు యాప్స్‌నే ఎరగా వేస్తున్నారు.
ఫలానా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే పాయింట్లు వస్తాయని, ఫ్రీ షాపింగ్ కూపన్లు అంటూ ఓ మెసేజ్‌ను ఫోన్‌కు పంపిస్తారు. వీటితో అవసరం ఉన్నా లేకున్నా ఉచితం కదా అని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా గుర్తించిన ఈ తరహా ఆందోళనకర అంశాన్ని ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తున్నారు. షార్ట్ కట్‌లో ర్యాట్ అన్నమాట. వివిధ రకాల యాప్స్ మాటున నేరగాళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గాడ్జెట్స్‌లోకి చొప్పించి దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అన్నింటికీ యాప్స్ వినియోగమే..
ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో యాప్స్ వాడకం కూడా అలాగేపెరిగింది. నిద్ర లేవడం నుంచి ఉష్ణోగ్రత తెలుసుకోవడం, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్‌ఇలా.. ఒక్కో ఫోన్‌లో కనిష్టంగా 10 వరకు అప్లికేషన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో పెరుగుతున్న ఈ ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకోవడం కోసం సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తొలుత ఈ నేరగాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న మొబైల్ నెంబర్ల డేటాను సేకరిస్తున్నారు. దీనికోసం వారు కష్టపడకుండానే ఆన్‌లైన్‌లో కొంత మొత్తం చెల్లించి తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ నెంబర్లు తమ చేతికి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతోంది.
ర్యాట్‌తో ఓటీపీ సైతం స్వాహా...
మన ఫోన్‌కు వచ్చే ఓటీపీని కూడా ఇక్కడ సైబర్ నేరగాళ్లు సంగ్రహించేస్తారు. ఇందుకు వారు ముందు పంపే యాప్ ద్వారానే ఏర్పా?ట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే వారికి వెళ్లిపోతుంది. కార్డుల వివరాలు వారివద్ద అప్ప?టికే సిద్ధంగా ఉంటాయి. కనుక ఓటీపీ రాగానే వారు తేలిగ్గా లావాదేవీ పూర్తి చేసేస్తున్నారు. ఇలానే సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే దోపిడీలకు తెగబడుతున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను మాత్రం సైబర్ నేరస్థులు అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో మొబైల్స్ వినియోగదారులు నిద్రలో ఉంటారని, ఈ నేపథ్యంలోనే అతడి ఫోన్‌ను అతని ప్రమేయం లేకుండానే ఓటీపీ వచ్చిన విషయమే గుర్తించరని వివరిస్తున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి అక్రమ లావాదేవీలు చేసే సైబర్ నేరస్థులు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, ఆన్‌లైన్‌లో ఖరీదు చేసి బోగస్ చిరునామాల్లో తీసుకుంటున్నట్టు గుర్తించారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా వారిని పట్టుకోవడం దాదాపు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు, వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న మెసేజ్‌తో ప్రారంభమై..
తాము ఉచితంగా అందిస్తున్న యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ నేరగాళ్ల తొలుత బల్క్ ఎస్సెమ్మెస్‌లు అనేకమందికి పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు ఎవరైనా అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే చాలు.. సదరు యాప్ స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. యాప్‌తోపాటే నేరగాళ్లు పంపించే ‘ట్రోజన్’ కూడా అదే గాడ్జెట్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి మన ఫోన్ సైబర్ క్రైమ్ నేరస్థుడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఏదైనా జరగరాని నష్టం జరిగితే తప్ప.. ఫోన్ సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న స్మార్ట్ మొబైల్‌ను నియంత్రిస్తూ తనకు అవసరమైన విధంగా వాడుకుంటారు. అందుకే ఈ వైరస్‌ను ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తుంటారు.
మన ప్రమేయం లేకుండానే..
నేరగాళ్ల ఆధీనంలోకి ఫోన్ వెళ్లిపోవడంతో మనం ఫోన్‌లో చేసే ప్రతి చర్యను అతడు కూడా పర్యవేక్షించగలడు. కాల్స్, డేటా వినియోగం, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు.. ఇలా మొబైల్‌లో ఉన్న మొత్తం సమాచారం దాని ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను సైతం సైబర్ నేరస్థుడు ఈ ర్యాట్ చొప్పించడం ద్వారా తమ నియంత్రణలోకి తీసుకోగలడు. ఎస్సెమ్మెస్‌లతో పాటు ఇటీవల సినిమా టిక్కెట్ల నుంచి చాలా రకాల బిల్లుల చెల్లింపులను కూడా ఆన్‌లైన్‌లో అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారానే చేసేస్తున్నారు. ఇలాంటి క్రయవిక్రయాల కోసం మొబైల్ వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీ సైతం అదే ఫోన్‌కి వస్తుంది. ఎవరైనా డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా ఓటీపీ నమోదు చేయందే లావాదేవీ పూర్తికాదు. అందుకే.. సైబర్ నేరగాడు తెలివిగా ర్యాట్‌ను ఫోన్‌లోకి యాప్స్ ద్వారా పంపించి సమాచారం లాగేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment