41మందికి 'రేవ్' పెట్టిన పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తూనే ఉన్నా .. నగర శివార్లలో మాత్రం రేవ్ పార్టీల విష సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా శామీర్‌పేట లియోనియా రిసార్ట్ పక్కనే ఉన్న విల్లాలో అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
ఈ సందర్భంగా 31మంది యువకులు, పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న రాఖీతో పాటు సూర్య, కరీం, రమేష్‌లను అరెస్ట్ చేసి, బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి నాలుగున్నర లక్షల నగదు, రెండు ల్యాప్ టాప్స్, 32 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న యువతీయువకుల్లో రాష్ట్రవాసులేకాక, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటకకు చెందినవారు ఉన్నారు.
కాగా ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలాంటి మహానగరాలకే అలవాటైన రేవ్ పార్టీ సంస్కృతి హైదరాబాద్‌లో కూడా చిన్నచిన్నగా విస్తరిస్తోంది. వీకెండ్ వస్తే చాలు ఢిఫరెంట్ ఎంజాయ్ కోసం యూత్ రేవ్ పార్టీలను ఆశ్రయిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ప్రతి వీకెండ్‌లో ఎక్కడో ఓ చోట రేవ్ పార్టీలు జరుగుతున్నా.. బయటపడేవి కొన్ని మాత్రమే.
రేవ్ పార్టీ అంటే...
పురుషులు, మహిళలు కలిసి ఒకే చోట మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ డ్యాన్స్ చేయడాన్ని క్లుప్తంగా రేవ్ పార్టీ అంటారు. 1950 సంవత్సరం ఇంగ్లండ్‌లో ఈ పార్టీలు మొదలయ్యాయి. క్రమంగా యూరోప్, అమెరికా అంతటా విస్తరించి భారత్‌కూ చేరాయి. ఈ పార్టీలు నిర్వహించడం, వాటిల్లో పాల్గొనడం చట్ట వ్యతిరేకం. కారణం.. రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు బాగా తెలిసిన వారికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. లోపల మందు, డ్రగ్స్, పెద్దగా సంగీతం ఉంటాయి.