Leonia Resort
-
సిటీలో మరో ప్రతిష్టాత్మక సదస్సు
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. ఈ నెల 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరగనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరగనుంది. జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకోనుండటం విశేషం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ సంస్థ తొలిసారిగా అంతర్జాతీయ కణ జీవ శాస్త్ర సదస్సులో పాల్గొంటోంది. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు రానున్నారు. ప్రీ కాంగ్రెస్ సెషన్, 8–9 ప్లీనరీ సెషన్లు, 20 టాపికల్ సెషన్లు జరగనుండగా, 150 మంది వక్తలు ప్రసంగించనున్నారు. ఎన్నో దేశాలు పోటీ పడినా.. ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ నాలుగేళ్ల కింద సింగపూర్‌లో సమావేశమై ఈ సదస్సును భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల కోసారి నిర్వహించే ఈ సదస్సును దక్కించు కోవడానికి ఎన్నో దేశాలు పోటీపడగా, తొలిసారిగా భారత్‌కు అవకాశం లభించింది. ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఒక్క దేశానికి సగటున 40 ఏళ్లలో ఒకేసారి దక్కుతుంది. గత మూడు దశాబ్దాలుగా కణ జీవశాస్త్ర రంగ పరిశోధనల్లో భారత్ కృషితో సదస్సు నిర్వహణకు అవకాశం లభించిందని ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ డైరెక్టర్ సత్యజీత్ మేయర్ పేర్కొన్నారు. కణ జీవ శాస్త్రంలో విద్యా ర్థులకు అపార అవకాశాలున్నాయని, హైద రాబాద్, గుంటూరులో జాతీయ, అంతర్జా తీయ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ఉప న్యాసం ఇప్పించనున్నామని తెలిపారు. మార్టిన్ ఉపన్యాసంతో ప్రారంభం.. అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసంతో 27న మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, బయోటెక్ పరిశ్రమలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. కణ జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణల నుంచి ఔషద ఉత్పత్తుల అభివృద్ధికి ప్రోత్సాహమందించాలనే లక్ష్యంతో జరిగే ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాస్త్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్గొంటారు. సదస్సు ముగింపు రోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.సీసీఎంబీ శాస్త్రవేత్తలు వి.రాధ, మధుసూదన్‌రావు, చడ్రక్లతో కలసి సంస్థ డైరెక్టర్ గురువారం సదస్సు వివరాలను వెల్లడించారు. మూలకణాలు, కణజాల నిర్మాణం, క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ పద్ధతులు, ఆరోగ్య, వ్యాధి నిర్ధారక పరీక్షల్లో కణ జీవశాస్త్ర ఉపయోగాలు వంటి అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. -
లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లియోనియా రిసార్ట్స్ నిర్మించడం కోసం చక్రవర్తి రాజు 11 బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రైతుల భూములకు సంబంధించిన బోగస్ పత్రాలను బ్యాంకుల్లో దాఖలు చేశారనే ఆరోపణలపై బెంగళూరు సీబీఐ టీమ్ కేసు నమోదు చేసుకుంది. ఈ రిసార్ట్‌కు కేవలం 30 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా... బ్యాంకులకు 100 ఎకరాలకు పైగా చూపించారని, బోగస్ డాక్యుమెంట్ల ద్వారానే ఇది సాధ్యమైందని సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు నిందితుడిగా ఉన్న చక్రవర్తి రాజును అరెస్టు చేశారు. -
41మందికి 'రేవ్' పెట్టిన పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తూనే ఉన్నా .. నగర శివార్లలో మాత్రం రేవ్ పార్టీల విష సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా శామీర్‌పేట లియోనియా రిసార్ట్ పక్కనే ఉన్న విల్లాలో అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా 31మంది యువకులు, పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న రాఖీతో పాటు సూర్య, కరీం, రమేష్‌లను అరెస్ట్ చేసి, బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి నాలుగున్నర లక్షల నగదు, రెండు ల్యాప్ టాప్స్, 32 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న యువతీయువకుల్లో రాష్ట్రవాసులేకాక, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటకకు చెందినవారు ఉన్నారు. కాగా ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలాంటి మహానగరాలకే అలవాటైన రేవ్ పార్టీ సంస్కృతి హైదరాబాద్‌లో కూడా చిన్నచిన్నగా విస్తరిస్తోంది. వీకెండ్ వస్తే చాలు ఢిఫరెంట్ ఎంజాయ్ కోసం యూత్ రేవ్ పార్టీలను ఆశ్రయిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ప్రతి వీకెండ్లో ఎక్కడో ఓ చోట రేవ్ పార్టీలు జరుగుతున్నా.. బయటపడేవి కొన్ని మాత్రమే. రేవ్ పార్టీ అంటే... పురుషులు, మహిళలు కలిసి ఒకే చోట మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ డ్యాన్స్ చేయడాన్ని క్లుప్తంగా రేవ్ పార్టీ అంటారు. 1950 సంవత్సరం ఇంగ్లండ్‌లో ఈ పార్టీలు మొదలయ్యాయి. క్రమంగా యూరోప్, అమెరికా అంతటా విస్తరించి భారత్‌కూ చేరాయి. ఈ పార్టీలు నిర్వహించడం, వాటిల్లో పాల్గొనడం చట్ట వ్యతిరేకం. కారణం.. రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు బాగా తెలిసిన వారికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. లోపల మందు, డ్రగ్స్, పెద్దగా సంగీతం ఉంటాయి.